Temple Economics: గుడి చుట్టూ..,

గుడికి వెళ్లి . . దేవుడిని దర్శించుకోవాలి .. అనే ఒక చర్య . .. ఆర్ధిక వ్యవస్థలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తూ . . ఎంతోమందికి ఉపాధి బాటను చూపుతోంది . హిందూ ఆచార, సంప్రదాయాల వెనుక ఉన్న కోణాలను నిశితంగా పరిశీలిస్తే  ఉన్నవన్నీ పరమార్ధాలే. ఉపాధి మార్గాలే . 

”ఆలయాల నిర్మాణం చేసినప్పుడు అప్పటి పాలకులు (రాజులు )  గుడిలో దేవుడికి సేవలు చేసేందుకు చాకలి ,  మంగలి ,  కుమ్మరి ,  కమ్మరి, చేనేత  . . ఇలా ఆలయాల సంప్రదాయాలకు అనుగుణంగా ఆయా వృత్తుల వారిని నియమించేవారు .  వారికి కొంత భూమిని కేటాయించేవారు .  ఆ భూమినే మాన్యం అని పిలిచేవారు .

ఉదాహరణకు భజంత్రిలు వాయించే నాయి బ్రాహ్మన (మంగలి ) , గుడికి అవసరమైన కుండలు చేసే కుమారులు . . ఇలా అప్పటి సమాజంలో మెజార్టీ కుల వృత్తుల వారికి ఆలయాలలో సేవలకు ఛాన్స్ కల్పించడం . . వారికి జీవన భృతికి ఎన్నోకొన్ని ఎకరాల భూమిని ఇవ్వడం ఆనవాయితీ .  ”

దేవాలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకుంటే కలిగే మానసిక ప్రశాంతత ., సంకల్పించిన పనులు సకాలంలో నెరవేరతాయన్న ఆత్మవిశ్వాసం కలుగుతాయి .  ఒక విధంగా చెప్పాలంటే భగవత్ దర్శనంలో  పుణ్యం . .పురుషార్థం .. .. అన్న రీతిలో బహుళ ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. తిరుమల వెంకన్నకు వేల కోట్ల ఆదాయం : తిరుమల శ్రీనివాసుడికి భక్తులు హుండీలో వేసే ఆదాయమే ఏటా … 1600 కోట్ల నుంచి 1800 కోట్ల వరకు ఉంటుంది .  ప్రసాదాలు విక్రయం ద్వారా మరో రూ .500 కోట్లు ,  డిపాజిట్ల ద్వారా వచ్చే వడ్డీ 900-950 కోట్లు ,  దర్శనం టికెట్స్ ద్వారా రూ 300 కోట్లు ,  సేవా టికెట్ల ద్వారా రు. 120 కోట్లు, రూమ్స్ అద్దెల ద్వారా  ఏటా 130 కోట్ల ఆదాయం వస్తోంది .  అంటే . . ఏడాదికి వెంకన్న స్వామికి 3,500-4,000 కోట్ల రూపాయలు ఆదాయం అనేక మార్గాల ద్వారా వస్తోంది .  భక్తులు ఇచ్చే విరాళాలు ,  గుప్త విరాళాలు ,  భూములు ,  భవనాలు వంటి స్థిర ఆస్తులు వీటికి అదనం.

తిరుమల శ్రీనివాసుడికి ఇంత పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందనుకుంటున్నాం కదా.. వెంకన్న సన్నిధికి  నిత్యం వచ్చే భక్తుల వల్ల ఉపాధి అవకాశాలు పొందుతున్న కుటుంబాలు ఎన్ని వేలల్లో ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు .  ఇలా భారత దేశ వ్యాప్తంగా ఆలయాల వెనుక దాగి ఉన్న ఆర్ధిక శాస్త్రం అర్ధం చేసుకుంటే ఏ మేరకు ఉపాధి అవకాశాలు కల్పన జరుగుతుందో కదా . .

అయోధ్యకు రోజు లక్షన్నర మంది భక్తులు: అయోధ్యలో శ్రీరాముడి దర్శనం కోసం నిత్యం లక్ష నుంచి  లక్షన్నర మంది వరకు భక్తులు వస్తున్నట్లు అంచనా. దేశం నలుమూలల నుంచీ అయోధ్యకు వచ్చే భక్తులతో ఉత్తరప్రదేశ్ లో వేలాది కుటుంబాలకు కొత్తగా ఉపాధి అవకాశాలు వచ్చాయి.

రాజుల ప్రత్యేక దృష్టి:    యుగాలకు ముందు అతి పురాతన కాలం నుంచీ దేవాలయాల చుట్టూ అనేక ఆర్ధిక కార్యకలాపాలు ఇమిడి ఉండేలా ఏర్పాట్లు జరిగాయి. ముఖ్య0గా భారత దేశాన్ని పాలించిన అనేకమంది రాజులు తమ రాజ్యాలలో విరివిగా దేవాలయాలను నిర్మించేవారు.  ఆలయాల నిర్మాణంతో శిల్పులు, ఆర్కి టెక్ట్చర్స్,    వాస్తు పండితులు, నిర్మాణ కార్మికులు.. ఇలా వేలాది మందికి ఉపాధి లభించేది. అత్యంత భక్తిభావం లేని రాజులు సైతం జనానికి ఉపాధిమార్గాలు చూపేందుకు ఆలయాల నిర్మాణం చేపట్టేవారని చరిత్రను అధ్యయనం చేస్తే తేటతెల్లమవుతోంది.

గుడి చుట్టూ ఉపాధి : కష్టాల నుంచి గట్టెక్కించాలని కొందరు, కోరికలు తీర్చమని ఇంకొందరు, ఈ మానవ జన్మను సార్ధకం చేసి ముక్తిని ప్రసాదించమని అతికొద్దిమంది దేవాలయాలకు వెళ్లి దేవుళ్ళకి మొక్కడం అనాదిగా వస్తున్న ఆచారం .  ఇలా గుడులకు వెళ్లే భక్తులు దేవుడికి సమర్పించేందుకు కొబ్బరికాయలు ,  అరటిపళ్ళతోపాటు ,  అగర్బత్తీలు, హారతి కర్పూరం ,  ఇతర పూజాసామాగ్రి.. ఇదో పెద్ద పరిశ్రమగా రూపాంతరం చెందింది.

  • తీర్థయాత్రలకు వెళ్లేవారు … వారికి అవసరమైన ,  కావలసిన వస్తువులను కొనుగోలు చేసిన తర్వాత ,, దేవుడి పాఠాలు ,  చేతి తాళ్లు ,  రుద్రాక్షలు ,  విభూతి ,  ప్రసాదాలు వంటివి బంధువులు ,  స్నేహితులు ,  తెలిసిన వారి కోసం కొంటుంటారు. ఇలా గుడి పరిసరాలలో వందల కొద్దీ దుకాణ దారులు  ఈ వ్యాపారాల ద్వారా జీవనోపాధిపొందుతున్నారు .
  • తీర్థయాత్రలకు వెళ్లే భక్తులు .. బస్సులు ,  రైళ్లు ,  విమానాల ద్వారా ప్రయాణాలు సాగిస్తుంటారు .  వీటి ద్వారా ఆయా సంస్థలు ,  ట్రావెల్ ఏజెంట్స్.. ఇలా అనేక రంగాలవారు ఉపాధి పొందడం సర్వసాధారణం.
  • యాత్రా స్థలాలలో ఎక్కువగా హోటల్స్ ,  లాడ్జి వ్యాపారాలు గణనీయంగా వృద్ధి చెందుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రాలలో వేల కొద్దీ రూమ్స్ నిర్మించారు. అవి సరిపోక … ఇప్పటికప్పుడు కొత్త హోటళ్ల నిర్మాణం సాగుతూనే ఉంది.
  • ప్రపంచంలో చాలా దేశాల్లో టూరిజం ఆదాయం ఎక్కువ .  మన దేశంలో టెంపుల్ టూరిజం ఆదాయం గణనీయంగా పెరుగుతోంది .
  • ఆలయాల చుట్టూ వెలిసే దుకాణాల  ద్వారా 70-80 శాతం వరకు స్థానికులకే ఉపాధి అవకాశాలు లభ్యమవుతాయి .
  • మనదేశ జీడీపీ (స్థూల దేశీయ ఉత్పత్తి ) లో ఆధ్యాత్మిక కేంద్రాలు ,  ఆలయాలు 2.85% శాతం ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి .
  • దేవాలయాల పరిసరాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ఏటా వందల కోట్ల రూపాయల జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి వస్తోంది .

 దేవాలయం . . అంటే ఆధ్యాత్మిక  కేంద్రం .    దీనికి చాలా మంది చాలా రకాలుగా సమాధానం ఇస్తారు. ఎక్కువగా భక్తి సంబంధమైన ఒక భావనగా భావిస్తారు. లేదా జీవితంలో వైరాగ్యం ఆవహించిన వారు కలిగి ఉండే ఒక చింతన అనుకుంటారు. నిజానికి ఆధ్యాత్మికతకు సార్వత్రిక నిర్వచనం లేదు, ఆధ్యాత్మికతను ఆచరించడానికి నిర్ధిష్టమైన మార్గం అంటూ ఏదీ లేదు. సంస్కృతంలో ఆధ్యాత్మికతకు ఆత్మతో పరిశీలించేది, ఆత్మవలన కలిగే భావోద్వేగాలు అనే అర్థాలు ఉన్నాయి. అయితే ఈ ఆధ్యాత్మికత భావన కలిగి ఉండటం వలన మనసులో ఒక ప్రశాంతత, ఒక నిశబ్ధం ఏర్పడుతుందని వివిధ శాస్త్రీయ  అధ్యయనాలు సైతం రూఢీ చేస్తున్నాయ్ .    ఆధ్యాత్మికతతో శారీరక, మానసిక శ్రేయస్సు సిద్ధిస్తుంది అని చాలా మంది విశ్వసిస్తారు.  

పురాతన వృత్తులకు ”పూరి జగన్నాధుడు ‘ ‘ ఆసరా :  ఒడిస్సాలోని పూరి జగన్నాధ్ స్వామి ఆలయంలో స్వామికి రోజుకొక రకం నైవేద్యం పెట్టడం అనాదిగా వస్తున్నా ఆచారం .  జగన్నాధుడికి పెట్టే నైవేద్యం దేశీయ వంగడాల్తో తయారు చేస్తారు. వైవిధ్యమే కాదు . .భక్తులకు ఇచ్చే ప్రసాదాలు కూడా సాంప్రదాయ పద్దతిలోనే తయారు చేస్తారు. నైవేద్యం ,  ప్రసాదాలు తాటాకు బుట్టలు వంటి పర్యావరణ హితమైనవి మాత్రమే వినియోగిస్తూ ఉంటారు. ఒడిశా వంటి ఆర్ధికంగా వెనుకబడిన రాష్ట్రాలలో ఇలాంటివి స్థానిక వృత్తిదారులకు ఉపాధి కల్పిస్తాయి .   తమిళనాడు రాష్ట్రంలో కూడా ఇలాంటి సంప్రదాయ పద్ధతులు చాలా ఆలయాలలో పాటిస్తున్నారు .  వీటి వల్ల పురాతన ,  సంప్రదాయ వృత్తిదారులకు ఉపాధి అవకాశాలు దక్కుతాయి.