”రోజూ పదులు , వందలు కాదు . . వేల కొత్త కార్లు రోడ్ల మీదకు వస్తున్నాయ్ . ఈ సంఖ్య రానురాను పెరిగిపోతోంది . ఇదే రీతిలో కార్ల సంఖ్య పెరిగిపోతుంటే . . 2025 నాటికి భారత్ రోడ్లపై రోజు 12 వేల అదనపు కార్లు కొత్తగా వచ్చే ఛాన్స్ ఉందని సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి . . ”
వ్యక్తిగత, వాణిజ్య వాహనాలకు భారత్ లో ఏటేటా డిమాండ్ పెరిగిపోతోంది. దీంతో భారత్‌లో 2035 నాటికి రోజుకు 12,000 కార్లు కొత్తగా రోడ్లపైకి రానున్నాయని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) అంచనా వేసింది. ఇదే సమయంలో మన దేశంలోని ఎయిర్ కండీషనర్లు (ఏసీలు) వినియోగించే విద్యుత్.. మెక్సికో దేశ మొత్తం కరెంట్ వినియోగాన్ని మించిపోతుందని వెల్లడించింది.
వచ్చే పదేళ్లలో భారత్‌లో ఇంధన వినియోగం మరింతగా పెరగనుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ).. వరల్డ్ ఎనర్జీ ఔట్‌లుక్-2024 పేరుతో విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. 2035 నాటికి భారత ఇంధన డిమాండ్ మరో 35 శాతం పెరుగుతుందని అంచనా వేసింది. అప్పటికి దేశంలో స్థాపిత విద్యుదుత్పత్తి సామర్ధ్యం ప్రస్తుత స్థాయి నుంచి మూడింతలు పెరిగి 14 లక్షల మెగావాట్లకు చేరుతుందని తెలిపింది. ఆర్థికాభివృద్ధి, పెరుగుతున్న జనాభా భారత్‌లో ఇంధన వినియోగాన్ని ప్రతి ఏటా పెంచేస్తున్నాయని నివేదిక పేర్కొంది.
వెహికల్స్ పెరిగితే పెద్ద కష్టమే: దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్న మోటారు వాహనాలపైనా ఐఈఏ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పెరుగుదల ఇలానే కొనసాగితే 2035 నాటికి రోజుకు 12,000 కొత్త కార్లు రోడ్లపైకి వస్తాయని అంచనా వేసింది. దాంతో రోడ్లపై ట్రాఫిక్ సమస్య , కాలుష్యంమ్ , వీటి పార్కింగ్ పెద్ద సమస్యగా మారనుంది. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు ఏటా 100 కోట్ల చదరపు మీటర్ల స్థలం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇది దాదాపు దక్షిణాఫ్రికా దేశ విస్తీర్ణానికి సమానం. 2035 నాటికి భారత్‌లో ఏసీలు వినియోగించే కరెంట్.. మెక్సికో దేశం వినియోగించే మొత్తం కరెంట్‌ను మించిపోతుందని తెలిపింది.
చమురు తిప్పలు తప్పవు: రానున్న ఐదేళ్ల తర్వాత చమురు ఉత్పత్తి దేశాలకు తిప్పలు తప్పవని ఐఈఏ స్పష్టం చేసింది. అప్పుడు ఇప్పటిలా కృత్రిమంగా ఉత్పత్తి కుదించి చమురు ధరలు పెంచుకునే ఈ దేశాల వ్యూహం పెద్దగా ఫలించకపోవచ్చని తెలిపింది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న విద్యుత్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన వనరులే ఇందుకు కారణమని స్పష్టం చేసింది. అయితే భారత్ ఈ విషయంలో కొన్ని సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని అంచనా వేసింది.ముఖ్యంగా డిమాండ్‌కు తగ్గట్టు విద్యుత్ వాహనాలు, చార్జింగ్ స్టేషన్లు అందుబాటులో లేకపోవడం పెద్ద సమస్యగా మారనుంది. దీంతో ఇప్పటికే చమురు వినియగం, దిగుమతుల్లో మూడో స్థానంలో ఉన్న భారత్ వచ్చే పదేళ్లలోనూ అదే స్థానంలో కొనసాగుతుందని ఐఈఏ అంచనా. అప్పటికి భారత రోజువారీ చమురు దిగుమతులు మరో 20 లక్షల బ్యారెల్స్ మేర పెరిగే అవకాశం ఉందని తెలిపింది.