Leaves: మనసు బాలేదా? అయితే సెలవు తీసుకోండి.!ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌..

చైనా: ఉద్యోగులు తమ మానసిక పరిస్థితి ఎలా ఉన్నా విధులకు హాజరు కాక తప్పదు. అలాంటి పరిస్థితుల్లో ఆఫీసుకు వెళ్లినా అన్యమనస్కంగానే పనిచేస్తారు. అయితే మనసు బాలేనప్పుడు ఆఫీసుకు రావద్దంటోంది ఓ కంపెనీ. ఆరోజు సెలవు తీసుకోమంటోంది. సూపర్‌ కదా… అర్జంటుగా ఆ కంపెనీ ఏంటో తెలుసుకోవాలనిపిస్తోందా.. ఆగండాగండి.. ఇది ఇండియాలో కాదు.. చైనాలో. చైనాకు చెందిన ఓ ప్రైవేటు కంపెనీ తన ఉద్యోగులకు ఇచ్చిన ఆఫర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సెంట్రల్ చైనాలోని రిటైల్ సంస్థ పాంగ్ డాంగ్ లాయ్‌ సూపర్‌ మార్కెట్‌ వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌ యు డాంగ్లాయ్ తమ కంపెనీకి లాభాలు తెస్తున్న ఉద్యోగులకు పదిరోజుల లీవ్‌ ఆఫర్‌ ఇచ్చారు. విధులకు హాజరు కావడానికి మానసికంగా సిద్ధంగా లేని రోజున సెలవు తీసుకోమంటున్నారు. ఈ లీవ్‌ను మేనేజ్‌మెంట్‌ కుదరదని చెప్పడానికి వీల్లేదట. ఉద్యోగి మనసు బాలేదని ఆఫీసుకు సెలవు పెడితే ఇచ్చి తీరాల్సిందేనట. ప్రతీ ఉద్యోగి స్వేచ్ఛగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రతీ ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. దానివల్ల ఉద్యోగుల మనసు బాగోలేకపోతే వారు సెలవు తీసుకోవచ్చు. ఈ సెలవుల వల్ల వారు తమ మనసును తేలిక పరుచుకొని నూతన ఉత్సాహంతో తిరిగి పనుల్లోకి వస్తారు. నా విధానం ప్రకారం ఉద్యోగులను ఓవర్ టైం పని చేయమని బలవంతం చేయడం అనైతికం అని డాంగ్లాయ్ అన్నారు.

రోజుకు ఏడు గంటలు మాత్రమే పని చేయాలి, వారాంతాల్లో సెలవులు ఉండాలి, 30 నుంచి 40 రోజుల వార్షిక సెలవులు ఇవ్వాలి. మా కంపెనీ అత్యధిక లాభాలు పొందాలని నేను అనుకోను. మా ఉద్యోగులు ఆరోగ్యంగా, ప్రశాంతంగా జీవించాలని మేము కోరుకుంటున్నాము. దానివల్ల కంపెనీ అభివృద్ధి చెందుతుంది అంటూ యు డాంగ్లాయ్‌ తెలిపారు. కాగా పాంగ్ డాంగ్ లై సూపర్‌మార్కెట్‌లో పని చేసే ఉద్యోగుల సగటు నెలవారీ జీతం 7,000 యువాన్లు. అంటే 80,878 రూపాయలు. అన్‌హ్యాపీ లీవ్‌’ కింద ఏడాదిలో 10 రోజుల లీవ్‌ను సంస్థ ఇస్తుంది. వార్షిక సెలవులకు ఇవి అదనం.