Vijayawada: రాజరాజేశ్వరీదేవిగా కనకదుర్గమ్మ దర్శనం

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో  దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి.  పదో రోజైన శనివారం అమ్మవారు శ్రీరాజరాజేశ్వరీదేవిగా  దర్శనమిస్తున్నారు. విజయ దశమి ఉత్సవాల చివరి రోజు కావడంతో తండోపతండాలుగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మరో వైపు భవానీలు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు.

ఈ యేడాది  భవానీలు  అధిక సంఖ్యలో ఇంద్రకీలాద్రికి చేరుకోవడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి.   జై దుర్గ.. జై జై దుర్గ నామస్మరణతో మారుమోగుతున్నాయి. భక్తులు రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో క్యూలైన్లలో యథావిధిగా మంచినీళ్లు, మజ్జిగ, పాలు పంపిణీ చేస్తున్నారు. శనివారం రాత్రి నిర్వహించే తెప్పోత్సవంతో ఉత్సవాలు ముగియనున్నాయి.

కృష్ణానదిలో నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో దుర్గా ఘాట్ వద్దే తెప్పోత్సవం నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. సాయంత్రానికి నదిలో నీటి ప్రవాహం తగ్గితే యథావిధిగా తెప్పోత్సవం నిర్వహించనున్నారు. నదిలో నీటి ప్రవాహం అంతే విధంగా కొనసాగితే ఘాట్ వద్దే హంసవాహనంపై తెప్పోత్సవం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.