విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మహిషాసురమర్దిని దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇంద్రకీలాద్రిపై రేపు పూర్ణాహుతితో ఉత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. భవానీ దీక్షాధారుల రాకతో ఇంద్రకీలాద్రిపై భక్తులు రద్దీ పెరిగింది.
లోకకంటకుడైన మహిషాసురుడిని చంపిన మహోగ్రరూపం ఇది. సకలదేవీ, దేవతల శక్తులన్నీ ఈ దేవీలో మూర్తీభవించి ఉంటాయి. మానవనేత్రంతో చూడ సాధ్యం కాని దివ్యతేజస్సుతో, అనేక ఆయుధాలతో సింహవాహినియై ఈ తల్లి భక్తులకు దర్శనభాగ్యం కలిగిస్తోంది. ఈ తల్లి అనుగ్రహం పొందితే అసాధ్యమనేది ఉండదు. మహిషాసుర సంహారం జరిగిన రోజునే ‘మహర్నవమి’గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ రోజున చండీ సప్తశతీహోమం చేసిన వారికి శత్రుభయం ఉండదు. అన్నింటా విజయం కలుగుతుంది.