హర్యానలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అందరూ అంచనావేశారు. కాని అందుకు భిన్నంగా మళ్లీ మూడోసారి కూడా బీజేపీనే విజయం సాధించింది. ఈ క్రమంలో హర్యానా వార్తల్లోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఏడీఆర్ వెల్లడించిన ఓ నివేదికతో హర్యానా మరింత ఆసక్తికరంగా మారింది.
హర్యానా ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో 96 శాతం మంది కోటీశ్వరులే ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. ఎన్నికల్లో గెలుపొందిన 90 మంది అభ్యర్థుల అఫిడవిట్లను ఏడీఆర్ పరిశీలించగా ఈ విషయం తెలిసింది.
ఇక 90 మందిలో 44 శాతం మందికి రూ.10కోట్ల కంటే ఎక్కువగా ఆస్తులున్నాయి. కేవలం 2.2శాతం మందికి మాత్రమే రూ.20 లక్షల లోపు ఆస్తులున్నాయని తెలిసింది. అలాగే 13 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 95 శాతం కాంగ్రెస్, 96 శాతం బీజేపీ, ఐఎన్ఎల్డీతో పాటు స్వతంత్ర అభ్యర్థులు వందశాతం తమకు రూ.కోటి కంటే ఎక్కువగా ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు.
హిసార్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన సావిత్రి జిందాల్ రూ.270కోట్ల ఆస్తులతో మొదటి స్థానంలో ఉంటే. రూ.145 కోట్లతో శక్తి రాణిశర్మ (బీజేపీ), రూ.134 కోట్ల ఆస్తులతో శృతి చౌదరి వరుగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. అలాగే తిరిగి ఎన్నికైన ఎమ్మెల్యేల ఆస్తులు 59శాతం పెరిగినట్లు రిపోర్ట్ వెల్లడించింది. గతంలో వారి ఆస్తులు రూ.9.08కోట్లు ఉండగా.. ఇప్పుడు రూ.14.46కోట్లకు పెరిగాయని తెలిపింది.