విజయవాడ: ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలను సమర్పించారు. కుటుంబ సమేతంగా దుర్గ గుడికి చంద్రబాబు విచ్చేశారు. వీరికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో ఆలయ సేవా కమిటీ సభ్యులను ఆయన మర్యాదపూర్వకంగా పలకరించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి తలకు స్థానాచార్యులు శివప్రసాదశర్మ పరివేట్టం చుట్టారు. అనంతరం పట్టువస్త్రాలు తలపై పెట్టుకుని దుర్గమ్మ సన్నిధికి వెళ్లారు.
దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు : అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి అంతరాలయంలో జగన్మాతను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, భువనేశ్వరి, మంత్రి లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్కు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. తీర్థప్రసాదాలు, అమ్మవారి చిత్రపటం అందజేశారు.