శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం స్వామివారు రాముని అవతారంలో హనుమంత వాహనంపై మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. గురుశిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వవివేచన తెలిసిన మహనీయులు కాబట్టి ఈ ఇరువురిని చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుందని నమ్మకం. వరద హస్తం దాల్చిన వేంకటాద్రి హనుమంత వాహనంపై ఊరేగారు. రామావతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. చతుర్వేద నిష్ణాతుడిగా, నవ వ్యాకరణ పండితుడిగా, లంకా భీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు తిరుమలేశుని తన మూపున వహించి తిరువీధులలో దర్శనమిచ్చే ఘట్టం భక్తజన రంజకంగా సాగింది. హనుమంతుని స్మరిస్తే బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, అజాడ్యం లభిస్తాయని భక్తుల విశ్వాసం. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు వాహన సేవను తిలకించారు. భక్తి పారవశ్యంతో స్వామిని దర్శించుకొని పులకించారు. ఆలయం మాఢవీధుల్లో శ్రీవారు స్వర్ణ రథంపై విహరిస్తున్నారు. అలాగే రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స్వామివారికి గజ వాహనసేవ ఉండనుంది. ప్రస్తుతం తిరుమలలో స్వర్ణ రథోత్సవం జరుగుతుంది.