ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. దాదాపు గంటపాటు చర్చించారు. ఈ సమావేశంలో చంద్రబాబు రాష్ట్రానికి చెందిన అనేక అంశాలను ప్రస్తావించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో వరద నష్టం, పోలవరం ప్రాజెక్టు, డయాఫ్రం వాల్ కు నిధులు, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్ అలాగే తాజా రాజకీయ పరిణామాల గురించి చంద్రబాబు ప్రధాని మోదీతో చర్చించారు. వరదలతో నష్టపోయిన ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు వీలుగా మరిన్ని నిధులు ఇవ్వాలని కోరినట్టు సమాచారం.
చంద్రబాబు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కూడా కలిశారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు పురోగతిపై చర్చించారు. రాష్ట్ర రాజధాని అమరావతికి అనుసంధానమయ్యే రైల్వే ప్రాజెక్టుల గురించి, పోర్టుల అభివృద్ధి, అనుసంధానం తదితర అంశాలను చంద్రబాబు ప్రస్తావించారు. రేపు కూడా చంద్రబాబు నాయుడు పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు. మంగళవారం ఉదయం 11గంటలకు నితిన్ గడ్కరీని కలవనున్నారు. ఇతర కేంద్రమంత్రులు పియూష్ గోయల్, హర్ దీప్ సింగ్ పురిని కలవనున్నారు.