ఢిల్లీ: రెండు రోజుల హస్తిన పర్యటనకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu). ప్రధాని మోదీ (PM Modi) తో భేటీ అయ్యారు. మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లిన చంద్రబాబు.. ఢిల్లీ చేరుకొని నేరుగా ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. అమరావతి, పోలవరం నిధులు, రాష్ట్రంలో వివిధ రహదారుల అభివృద్ధి, రైల్వేజోన్ శంకుస్థాపన, సెయిల్ లో విశాఖ స్టీల్ విలీనం, ఇటీవల సంభవించిన వరద బాధితులను ఆదుకొనేందుకు కేంద్రం నుంచి సాయం తదితర అంశాలను చర్చించినట్లు తెలుస్తోంది. విభజన హామీలు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. దాదాపు గంటపాటు ప్రధాని, చంద్రబాబు మధ్య చర్చలు జరిగాయి. అనంతరం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు కేంద్ర మంత్రి గడ్కరీని కలవనున్నారు. సాయంత్రం పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురీతో భేటీ కానున్నారు. ఆ తర్వాత రాత్రి 8 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో, రాత్రి 11.15 గంటలకు నిర్మలా సీతారామన్ తో సీఎం భేటీ కానున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు. ప్రాజెక్టుల నిర్మాణాలపై చర్చించే అవకాశముంది.