చంద్రబాబు ఎన్నికల సమయంలో ఉచితంగా ఇసుక అని హామీ ఇచ్చారు. అందులో భాగంగా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నారు. ఇసుక సీనరేజ్ రుసుము ఎవరి వద్ద నుంచీ వసూలు చేయడం లేదని, ఆన్లైన్ ద్వారా లోడింగ్, అన్ లోడింగ్ చార్జీలు, రవాణా చార్జీలు మాత్రం చెల్లించి ఇసుక పొందే అవకాశం కల్పించామని చెపుతున్నారు. అయితే ఉచిత ఇసుక అని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రతిపక్షం ప్రచారం చేస్తోంది. దాని మీద ప్రశ్నిలు గుప్పిస్తోంది. దీని పై చంద్రబాబు స్పందించారు.
ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా జరుగుతున్న ప్రచారంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలకు వెనుకాడవద్దని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనాకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారానికి బ్రేక్ వేయాలని ఆదేశించారు.
ఈ విధమైన ప్రచారంపై కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్లు, ఎస్పీలకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం నిజాయితీగా అమలు చేస్తున్న శాండ్ పాలసీపై జిల్లా స్థాయిలో నిజానిజాలు వెలికితీయాలని, తప్పుడు ప్రచారం చేస్తున్న వారు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని గనుల శాఖ ముఖ్య కార్యదర్శికి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.