విజయవాడలో కృష్ణలంక గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో బుధవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ హైకోర్టులో ఈ కేసు విచారణలపై స్టే విధించాలన్న అంశాన్ని గురువారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అలాగే ఏపీ హైకోర్టులో సాయికృష్ణ కేసును సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలన్న ఆదేశాలను కూడా గురువారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. బుధవారం ఈ కేసును సుప్రీంకోర్టులో జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం పైవిధంగా స్పందించింది. సాయికృష్ణ కేసుకు సంబంధించి హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలు, విచారణ పూర్తయి తీర్పు దశలో ఉన్న కేసు వివరాలు గురువారం ఉదయం 10.30 గంటలకు తమ ముందు ఉంచాలని పిటిషనర్లతోపాటు ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
సాయి కృష్ణ కస్టడీ మరణ కేసులోని పరిణామాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అతడిని మేజిస్ట్రేట్ ముందు ఎందుకు హాజరుపరచలేదని, ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఎందుకు ఆలస్యం జరిగిందని, పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజీని ఎందుకు తొలగించారని ప్రశ్నించింది. ధర్మాసనం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణపై స్టే విధించింది, రికార్డులను సీల్డ్ కవర్లో సమర్పించాలని ఆదేశించింది మరియు కేసును నేరుగా పర్యవేక్షించాలని నిర్ణయించింది.
హైకోర్టులో విచారణ ఏ దశలో ఉందో తెలుసుకున్న తరువాత మళ్లీ ఆదేశాలిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. లంచ్ బ్రేక్ తరువాత సాయికృష్ణ అదృశ్యం కేసులో.. హైకోర్టు విచారణలో ఉన్న కేసుల వివరాలను జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనం ముందు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులు ఉంచారు. మృతుడు సాయికృష్ణ తల్లి ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్న పిటిషన్‌పై హైకోర్టులో తీర్పు వాయిదా పడిందని ఈ సందర్భంగా ధర్మాసనం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్లింది. సాయికృష్ణ హెబియస్ కార్పస్, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని దాఖలైన ఐఏలపై తీర్పు వాయిదా వేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులు వెల్లడించారు.
రాష్ట్ర హైకోర్టు ఏయే పిటిషన్లపై తీర్పు వాయిదా వేసిందో స్పష్టమైన వివరాలు గురువారం ఉదయానికి తమకు అందించాలని వారిని జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం ఆదేశించింది. గురువారం ఉదయం తొలి కేసుగా దీనిని తీసుకుని విచారిస్తామని పేర్కొంది. ఉదయం విచారణ సందర్భంగా ఇచ్చిన మధ్యంతర ఆదేశాలు కొనసాగించాలా? లేదా? అన్న విషయంపై రేపు తమ నిర్ణయాన్ని వెలువరిస్తామని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది.
ఈ రోజు ఉదయం ఈ కేసు విచారణ సందర్భంగా కస్టడీలో సాయికృష్ణ అదృశ్యం కావడం, ఆధారాలు ధ్వంసం కావడంపై ఏపీ పోలీసులు, డీజీపీ తీరును జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టిన విషయం విదితమే. ఈ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సెప్టెంబర్ 30 వ తేదీ నాటికి సీల్డ్ కవర్లో తమకు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అక్టోబర్ 12వ తేదీకి ఈ కేసు తదుపరి విచారణను జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం వాయిదా వేసింది.



