మాజీ సీఎం వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో ఉన్న ప్రభుత్వ ఫర్నీచర్ పై టీడీపీ నేతలు చాలా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనికి వైసీపీ నేతలు కూడా ఘాటుగానే స్పందించారు. తర్వాత లేఖను కూడా రాశారు. పర్నీచర్ ను వెంటనే తీసుకుపోవాలని సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కు వైసీపీ మరో లేఖ రాసింది. జీఏడీ డిప్యూటీ సెక్రటరీకి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి లేఖ రాశారు. ఆ ఫర్నీచర్‌ను వెంటనే తీసుకుపోవాలని కోరారు. ఫర్నిచర్ లో కొన్నింటిని తమ దగ్గరే ఉంచుకునేందుకు అనుమతించాలని, వాటికి విలువ కడితే చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని, మిగిలిన వాటిని తిరిగి ఇచ్చేస్తామని పేర్కొన్నారు.
ఇప్పటికే ఈ విషయమై నాలుగు పర్యాయాలు లేఖ రాశామని తెలిపారు. జూన్ 15, ఆ తర్వాత జూన్ 19, మళ్లీ జులై 1, తిరిగి జులై 29న లేఖలు రాసినట్లుగా ఆయన గుర్తు చేశారు. అంతే కాకుండా పార్టీ కార్యాలయ ఇన్ చార్జి గణేశ్ రెడ్డి అనేక పర్యాయాలు ఈ విషయంపై జీఏడీని సంప్రదించిన విషయాన్ని కూడా ఆయన లేఖలో ప్రస్తావించారు. అసలు ఆ ఫర్నీచర్‌ను వెనక్కు తీసుకునే ఉద్దేశం ఉందా? లేదా? అని సూటిగా ప్రశ్నించారు. కేవలం నిందలు మోపడానికే, దీనిపై స్పందించడం లేదా? అని ఆయన నిలదీశారు.
ఒకవేళ మీకు వీలు కాకపోతే ఎక్కడికి పంపాలో జీఏడీ చెప్పాలని అప్పిరెడ్డి కోరారు. ఒకవేళ వెనక్కు తీసుకోవడం ఇష్టం లేకపోతే వాటి ఖరీదు చెబితే చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఏ విషయమూ వెంటనే చెప్పాలని వైసీపీ ప్రధాన కార్యదర్శి ఆ లేఖలో కోరారు.