వైసీపీ హయాంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్‌కు, అప్పటి ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి శేషగిరి బాబుకు హైకోర్టు జైలు శిక్ష విధించింది. కోర్టు ఉత్తర్వులు జారీ చేశాక వాటికి వక్రభాష్యం చెప్పడం కరెక్ట్ కాదని హెచ్చరించింది . కోర్ట్ ఉత్తర్వులను అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఈ సందర్బంగా తేల్చిచెప్పింది. కోర్టు ఉత్తర్వులు.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని భావిస్తే వాటిపై అప్పీల్ చేసే వెసులుబాటు ఉందని స్పష్టం చేసింది . ఉత్తర్వులకు వక్రభాష్యం చెబుతూ వాటిని అమలు చేయకుండా ఉండడానికి వీల్లేదని పేర్కొంది. ప్రస్తుత కేసులో కోర్టు ఉత్తర్వులు అమలు చేయని పాఠశాల విద్యాశాఖ అప్పటి ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, ఇంటర్మీడియెట్ బోర్డు అప్పటి కార్యదర్శి శేషగిరిబాబుకు నెలరోజుల సాధారణ జైలుశిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధించింది. అయితే, అప్పీల్ చేసుకునేందుకు వీలుగా సమయం ఇవ్వాలని అధికారుల తరఫు న్యాయవాదులు అభ్యర్థించడంతో తీర్పు అమలును నాలుగు వారాల పాటు నిలుపుదల చేసింది. తాము ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీల్ కోర్టు ఎలాంటి స్టే ఇవ్వకపోతే ఈ నెల 21న హైకోర్టు రిజిస్ట్రార్ జ్యుడీషియల్ ముందు లొంగిపోవాలని ఇద్దరు అధికారులకు స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకేటేశ్వర్లు కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో తీర్పు ఇచ్చారు.
ఇదీ వివాదం
ఇంటర్మీడియెట్ బోర్డులో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఎం. విజయలక్ష్మి 2022, ఆగస్టు 31న పదవీ విరమణ చేశారు. అదే ఏడాది జనవరి 31న పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఆర్థిక శాఖ జీవో 15ను జారీ చేసింది. ఈ జీవో ఆధారంగా తనను 62 ఏళ్లు వచ్చేవరకు ఉద్యోగంలో కొనసాగించాలని విజయలక్ష్మి ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శికి విన్నవించారు. సానుకూల స్పందన లేకపోవడంతో ఆమె 2023లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. విజయలక్ష్మికి 62 ఏళ్లు వచ్చేవరకు సర్వీసులో కొనసాగించాలని ఆదేశిస్తూ.. 2023 ఫిబ్రవరిలో ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఆదేశాలు అమలుకాకపోవడంతో విజయలక్ష్మి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. అప్పటి పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి శేషగిరిబాబును ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి.. అప్పటి పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ వైఖరిని తీవ్రంగా ఆక్షేపించారు. పలుమార్లు అవకాశం ఇచ్చినా కౌంటర్ దాఖలు చేయకపోవడంపై అభ్యంతరం తెలిపారు. ఇది కోర్టు ఉత్తర్వులను అగౌరవపర్చడమేనని పేర్కొన్నారు.