Airport Without Passport: విమాన ప్రయాణం చేయాలంటే ఎయిర్ పోర్ట్ వద్ద పాస్ పోర్ట్, ఐడీ కార్డ్ లేకుండా కుదరదు. విమానాశ్రయం లోపలికి వెళ్లినప్పటి నుంచి విమానం సీటులో కూర్చునేంత వరకు వాటి అవసరం ఉంటుంది. ముందుగా ఎయిర్ లైన్ కౌంటర్ వద్దకు వెళ్లి పాస్ పోర్ట్, టికెట్ చూపించి బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. తరువాత సెక్యూరిటీ చెక్ కోసం దాదాపు అరగంట సమయం వేచి చూడాలి. అది పూర్తయ్యాక ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ పాస్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ స్టాంప్ వేసిన తరువాత కనీసం మరో అరగంట సమయం వేచి చూడాలి. మళ్లీ లైనులో నిలబడి బోర్డింగ్ పాస్, పాస్ పోర్ట్ చూపించి విమానంలోకి వెళ్లాలి. విమానం తమ గమ్యస్థానం చేరుకోగానే మళ్లీ ఎయిర్ పోర్టులో దిగి అదే ప్రక్రియను రివర్స్ లో ఫాలో కావాల్సి ఉంటుంది.
ప్రయాణికులకు ఈ ప్రక్రియ అంతా ఇబ్బందిగా ఉండటంతో ఓ దేశం కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలోని ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికుల సౌకర్యం కోసం ఈజీ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. సరికొత్త టెక్నాలజీతో పాస్ పోర్ట్, ఐడీ కార్డ్ లేకుండా కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే ఎయిర్ పోర్ట్ ప్రక్రియ అంతా ముగిసే విధంగా చర్యలు తీసుకోనుంది. అయితే ప్రస్తుతం ఈ టెక్నాలజీ కొంత వరకు మాత్రమే అమలులోకి వచ్చిందని తెలుస్తోంది. యూఏఈ దేశంలోని అబుదాబి విమానాశ్రయాల్లో ప్రయాణికుల కోసం ఈ టెక్నాలజీని వినియోగిస్తుంది. మరో ఏడాదిలో కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో ఎయిర్ పోర్టు మొత్తం స్మార్ట్ ట్రావెల్ ప్రాజెక్ట్ పూర్తిగా అమలు చేయనుంది.
విమానాశ్రయంలో పాస్ పోర్ట్, ఐడీ కార్డ్ లేకుండా అరైవల్స్, డిపార్చర్ వరకు ప్రతీ చెక్ పాయింట్ సెన్సార్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. దీని సహాయంతో ప్రయాణికులు ఎయిర్ పోర్టులోకి రాగానే వ్యక్తిగత వివరాలు ( పేరు, వయసు, ఏ దేశస్థులు..) వంటి వివరాలు రికార్డ్ అయిపోతాయి. అలాగే సెక్యూరిటీ చెకింగ్ సైతం పూర్తిగా ఆటోమేటిక్ స్కానింగ్ ద్వారా జరగనుంది. గల్ఫ్ దేశాలకు వెళ్లే ప్రయాణికుల కోసం అబుదాబి ఎయిర్ పోర్ట్, దాని అనుబంధ ఎయిర్ లైన్స్ ఎతిహాద్ ఎయిర్ వేస్ లో ఈ టెక్నాలజీని రూపొందించినట్లు ఎయిర్ పోర్ట్ చీఫ్ ఇన్ఫరేషన్ అధికారి తెలిపారు. ఈ క్రమంలోనే యూఏఈ దేశానికి తొలిసారి వచ్చిన ప్రయాణికుల సమాచారాన్ని సేకరించి వారి బయోమెట్రిక్ డేటాను ఐసీపీ టెక్నాలజీ ద్వారా ఇమ్మిగ్రేషన్ విభాగానికి చేరనుందని పేర్కొన్నారు. ఈ డేటాను ఒక డేటా బేస్ లో స్టోర్ చేస్తారని.. ఆ తరువాత సదరు ప్రయాణికులు ఎన్ని సార్లు ఎయిర్ పోర్ట్ కు వచ్చినా తన పాస్ పోర్ట్, ఐడీ చూపించాల్సిన అవసరం ఉండదని తెలిపారు. దీని వలన ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉంటారని అదేవిధంగా సమయం చాలా ఆదా అవుతుందని వివరించారు.