New liquor policy: ఏపీలో ప్రైవేట్ మద్యం షాపులు.. క్వార్టర్ రూ.99కే..

మందుబాబులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.  అదే ప్రైవేటు మద్యం షాపులు అందుబాటులోకి రానున్నాయి. అది కూడా దసరా పండుగకు ముందే.  ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఈ విషయం మీడియాకు వెల్లడించారు.  గత ప్రభుత్వం మద్యం విధానం ద్వారా  దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు.  ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రైవేటు వైస్ షాపులు నడిచేలా  నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.  రెండేళ్ల కాల పరిమితితో నూతన మద్యం పాలసీని ప్రభుత్వం తీసుకువచ్చింది.
 
దాని ప్రకారం  అక్టోబర్ 12 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు ఈ విధానం అమల్లో ఉంటుంది.   మొత్తం 3,396 మద్యం షాపుల లైసెన్స్ ల జారీకి సోమవారం అర్ధరాత్రి తర్వాత ప్రభుత్వం నోటిఫికేషన్  విడుదల చేసింది. మంగళవారం నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మద్యం షాపులు నిర్వహించాలనుకునే వారు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకునే వీలుంది.  ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చు అయితే ఒక్కో దరఖాస్తునకు రూ.2లక్షల చొప్పున నాన్ రిఫండబుల్ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల 11న కలెక్టర్ల నేతృత్వంలో లాటరీ తీసి, లైసెన్సులు కేటాయించనున్నారు.  12 నుంచి లైసెన్సుదారులు కొత్త దుకాణాలను ప్రారంభించి అమ్మకాలు చేపడతారు.

మొత్తం నాలుగు శ్లాబుల్లో లైసెన్సులు ఖరారు చేస్తారు. జనాభా ప్రాతిపదికన ఈ శ్లాబుల పద్ధతి ఉంటుంది.  లైసెన్సు రుసుమును ఆరు వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. గత వైసీపీ ప్రభుత్వంలో మద్యంపై పది రకాల పన్నులు విధించగా, ఈ నూతన విధానంలో వాటిని ఆరుకు కుదించారు.  రూ.99లకే క్వార్టర్ లభించేలా ఎంఆర్పీలు నిర్ణయించారు.   ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు గీత కార్మికుల విభాగంలోకి వచ్చే ఆరు కులాలకు 340 మద్యం షాపులను కేటాయించనున్నారు. ఈ రిజర్వుడ్ షాపులకు సంబంధించిన విధానాన్ని  రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం విడుదల చేయనుంది.

ఈ నగరాల్లో 12 ప్రీమియం స్టోర్సులు
ప్రస్తుతం ప్రభుత్వం నోటిఫై చేసిన 3,396  షాపులకు అదనంగా మరో 12 ప్రీమియం స్టోర్సులు ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురంలో  ఏర్పాటునకు ఖరారు చేశారు.   ఈ దుకాణాలకు అయిదేళ్ల కాలపరిమితి ఉంటుంది. లైసెన్సు రుసుము ఏడాదికి రూ.కోటి గా నిర్ణయించారు. అయితే వీటికి సంబంధించి విధివిధానాలను విడిగా ఖరారు చేయనున్నారు.