వాహన తయారీ సంస్థ మహీంద్రా మార్కెట్లోకి తేలికపాటి వాణిజ్య వాహనం (ఎల్‌సీవీ) ‘వీరో’ తీసుకువచ్చింది. 3.5 టన్నుల లోపు విభాగంలో ఈ వాహనం సరికొత్త ప్రమాణాలు నెలకొల్పనుందని ఎం అండ్ ఎం ఆటోమోటివ్ డివిజన్ ప్రెసిడెంట్ విజయ్ నక్రా వెల్లడించారు. మహీంద్రా కొత్తగా అభివృద్ధి చేసిన అర్బన్ ప్రాస్పర్ ప్లాట్‌ఫామ్‌పై (యూపీపీ) వీరోను డిజైన్ చేసినట్లు ఆయన చెప్పారు. డీజిల్, సీఎన్‌జీ వేరియంట్ ఆప్షన్స్‌తో అందు బాటులో ఉండనున్న వీరో ప్రారంభ ధర రూ.7.99 లక్షలు. 1,600 కేజీల పేలోడ్ సామర్థ్యంతో కూడిన వీరో లీటర్ డీజిల్‌కు 18.4 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనుండగా కేజీ సీఎన్‌జీకి 19.2 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని విజయ్ పేర్కొన్నారు. 3.5 టన్నుల లోపు విభాగంలో కంపెనీ స్థానాన్ని వీరో మరింత బలోపేతం చేస్తుందన్నారు. ఈ విభాగంలో ఎవరు అందించనటువంటి ఫీచర్లు, టెక్నాలజీని వీరో వాహనంలో పొందుపరిచినట్లు ఆయన చెప్పారు.ఈ విభాగంలో తొలిసారిగా డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్, రివర్స్ పార్కింగ్ కెమెరా, 10 అంగుళాల టచ్‌స్ర్కీన్, పవర్ విండోస్‌ను కొత్త వీరోలో ఉన్నాయన్నారు. మారుతున్న పరిస్థితులు, వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఈ వాహనాన్ని డిజైన్ చేసినట్లు తెలిపారు.