తిరుమలలో వేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలు ఏడో రోజుకు చేరుకున్నాయి. గురువారం ఉదయం స్వామి సూర్యప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు. శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంలో సూర్యమండల మధ్యస్థుడైన హిరణ్మయ స్వరూపుడిగా రామకృష్ణ గోవింద అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు.
శంఖు చక్రాలు, కత్తి, విల్లు, బాణం, వరద హస్తంతో భక్తులకు దర్శనం ఇచ్చారు. సూర్య ప్రభ వాహనం ముందు గజరాజులు రాజసంతో నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా వాహన సేవలను కనులారా దర్శించుకుని తరించేందుకు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్న భక్తులు ఈ విశేష సేవను దర్శించుకున్నారు.
ప్రత్యక్ష దైవం సూర్య నారాయణుడు సకలరోగ నివారకుడు. ఆరోగ్యకారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాతగా పురాణాల కథనం. అంతేకాదు రాత్రికి రాజు, ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తాడు. బ్రహ్మోత్సవంలో శ్రీవారు ఏడో రోజు ఊరేగే సూర్యప్రభ వాహనం సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని పూజిస్తాం.
వాహనసేవలో తిరుమల పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం, సీవీఎస్ ఓ శ్రీధర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.