ముంబయి: ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) సీనియర్ నేత, సల్మాన్ ఖాన్ స్నేహితుడు బాబా సిద్ధిఖీ (Baba Siddique) హత్య కేసులో నిందితుడైన ధర్మరాజ్ కశ్యప్ మైనర్ కాదని తేలింది. హత్య కేసులో నిందితులైన హరియాణాకు చెందిన కర్నైల్ సింగ్, ఉత్తరప్రదేశ్ కు చెందిన ధర్మరాజ్ కశ్యప్, యూపీకి చెందిన శివకుమార్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే న్యాయస్థానంలో ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలో నిందితుల్లో ఒకరైన ధర్మరాజ్ కశ్యప్ తాను మైనర్ నని ముంబయి కోర్టుకు తెలిపాడు. నిందితుడి వద్ద సరైన జనన ధృవీకరణ పత్రాలు లేకపోవడంతో అతడు చెప్పేది నిజమో, కాదో తెలుసుకోవడానికి బోన్ అసిఫికేషన్(bone ossification) టెస్టు చేయాలని న్యాయస్థానం పోలీసులకు సూచించింది. తాజాగా ఆ టెస్టు రిపోర్టుల్లో అతడు మైనర్ కాదని తేలడంతో నిందితుడిని పోలీస్ కస్టడీకి తరలించారు. నిందితులకు అక్టోబర్ 21 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తున్నట్లుగా కోర్టు పేర్కొంది. కాగా ఈ హత్య కేసు నిందితులకు ఆశ్రయం ఇచ్చిన పుణెకు చెందిన ప్రవీణ్ లోకర్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లుగా ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు. ఈ హత్యకు బిష్ణోయ్ గ్యాంగే కారణమని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన షుబు లోకర్ కు ఇతడు సోదరుడని తెలిపారు. కాగా షుబు లోకర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
బాబా సిద్ధిఖీ శనివారం సాయంత్రం ముంబయిలోని బాంద్రాలో తన కుమారుడి కార్యాలయంలో ఉండగా.. పలువురు దుండగులు అతడిపై కాల్పులకు పాల్పడ్డారు. వెంటనే ఆయన్ను లీలావతి ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ హత్య చేసింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. సిద్ధిఖీకి ముంబయి బాంబు పేలుళ్ల సూత్రధారి, భారత్ మోస్ట్ వాంటెడ్ దావూద్ ఇబ్రహీం (Dawood Ibrahim) తో సంబంధాలు ఉండటం, తమ టార్గెట్ అయిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు అతడు స్నేహితుడు అవడం వంటి కారణాల వల్లే అతడిని హత్య చేశామని పేర్కొంది. అయితే ఈ లింకులపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.