విజయవాడ విమానాశ్రయం నుంచి సింగపూర్, దుబాయ్‌లకు అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు . ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు తెలిపారు . విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతనంగా నిర్మించిన గ్రాండ్ ఎంట్రన్స్ వేను, విజయవాడ – ఢిల్లీ ఇండిగో సర్వీసును ఆయన ప్రారంభించారు. విజయవాడ విమానాశ్రయంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ పనులపై సమీక్ష నిర్వహించారు. అనంతరం రామ్మోహన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ‘కూటమి ప్రభుత్వం కొలువు తీరిన మూడు నెలల్లోనే విజయవాడ నుంచి ముంబాయికి రెండు, బెంగళూరు, ఢిల్లీకి ఒక్కోటి చొప్పున అదనంగా విమాన సర్వీసులను ప్రవేశపెట్టాం. ఈ చర్యలతో ప్రస్తుతం విజయవాడ విమానాశ్రయం నుంచి నెలకు లక్ష మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రపంచ వ్యాప్తంగా విమాన సర్వీసులు నడిపేందుకు దశల వారీగా చర్యలు తీసుకోనున్నాం. దీనికి కావాల్సిన ద్వైపాక్షిక ట్రాఫిక్ రైట్స్ కోసం కృషి చేస్తాం. 2025 జూన్ నాటికి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ పనులను పూర్తి చేయాలన్నది లక్ష్యం.టెర్మినల్ పనులు ఇప్పటి వరకు 52 శాతం జరిగాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా పనులు కొంత మేర మందగించాయి. మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి విజయవాడ విమానాశ్రయంపైనే ఎక్కువ దృష్టి సారించా. అక్టోబరులో విజయవాడ – విశాఖపట్నం మధ్య మరో కొత్త విమాన సర్వీసును ప్రారంభిస్తున్నాం. రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయటం ద్వారా పెట్టుబడులను ఆకర్షించటంపై దృష్టి సారించినట్లు తెలిపారు .