కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని సన్నిధిలో అధికారుల నిర్లక్ష్యంతో ఘోరం జరిగింది .
తిరుపతిలో వైకుంఠద్వార సర్వదర్శన టోకెన్ల జారీలో అపశ్రుతి చోటు చేసుకుంది. టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తోపులాట జరిగింది. తిరుపతిలోని మూడు ప్రాంతాల్లో భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకోగా, శ్రీనివాసం వద్ద తమిళనాడు సేలంకు చెందిన భక్తురాలు మృతి చెందారు.
బైరాగిపట్టెడ వద్ద రామానాయుడు స్కూల్ వద్ద ఉన్న కేంద్రంలో జరిగిన తోపులాటలో నలుగురు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరో ఇద్దరు భక్తులు మృతి చెందారు. మొత్తంగా తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందారు. అదే విధంగా సత్యనారాయణపురంలోని టోకెన్ల జారీ కేంద్రం వద్ద సైతం తోపులాట చోటు చేసుకుంది. మొత్తంగా అస్వస్థతకు గురై రుయా ఆస్పత్రిలో 19 మంది, స్విమ్స్‌లో 10 మంది చేరారు.
భక్తుల రద్దీతో టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే టోకెన్ల జారీకి నిర్ణయించారు. భక్తులు భారీగా తరలిరావడంతో టోకెన్ల జారీ ప్రారంభించామని టీటీడీ ఈవో అన్నారు.భక్తుల రద్దీని అదుపు చేసేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. అన్ని కేంద్రాల వద్దకు అదనపు బలగాలను తరలించారు.
చంద్రబాబు దిగ్భ్రాంతి: తిరుపతి తోపులాటలో భక్తుల మృతిపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతి ఘటన తీవ్రంగా కలిచివేసిందన్న సీఎం చంద్రబాబు, టీటీడీ అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితి తెలుసుకుంటున్నారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని, ఘటనాస్థలంలో సహాయ చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశించారు. గురువారం ఉదయం బాధితులను ముఖ్యమంత్రి పరామర్శించనున్నారు .