అరెస్టులు, అక్రమ కేసులు ఎక్కడికి దారితీస్తాయి?

రెండు తెలుగు రాష్ట్రాల్లోను ప్రతిపక్షనేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలపైనా అరెస్టులు, గృహనిర్బంధాల పరంపర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ విధమైన ప్రతీకార చర్యలు ఇంతకు ముందెన్నడూ లేవని, ఇప్పుడే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అంతకు ముందు అధికార పార్టీలో ఉన్నవాళ్లను ప్రతిపక్ష నేతలు విమర్శించడం, అలాగే ప్రతిపక్షాలను అధికార పార్టీ వాళ్లు ఆరోపించడం, సవాళ్లు విసిరుకోవడం లాంటివి ఉండేవి. కాని ఈ విధంగా అరెస్టులు, ప్రతీకార చర్యలకు పాల్పడడం ఇప్పడే మొదలైందని అంటున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఉన్నా అది ఇప్పుడు ఇక్కడికి కూడా పాకినట్టే కనిపిస్తోంది.

తెలంగాణలో నిరసనలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరుగ్యారెంటీలు అమలులో విఫలమయ్యారంటూ బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తూ వస్తున్నారు. రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదని నిరసనలు, ఆందోళనలకు దిగారు. అలాగే గృహలక్ష్మి పథకం వల్ల ఆటో డ్రైవర్స్ కు అన్యాయం జరుగుతోందని అప్పట్లో చాలా విమర్శలు చేశారు. హైడ్రా పేరుతో చేపట్టిన కూల్చివేతలు, తాజాగా మూసీ ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా పేదల ఇళ్లను కూల్చివేయడంతో పేద ప్రజల నుంచి విపరీతమైన వ్యతిరేకత వచ్చింది.

అరెస్టులు, నిర్బంధాలు

ఆరుేగ్యారెంటీల అమలు విషయంలో ఇటీవల హరీశ్ రావు తీవ్రంగా విమర్శలు మొదలు పెట్టారు. లోకల్ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టారు. అందులో భాగంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావును అరెస్టు చేశారు. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు రాస్తారోకోలు, ధర్నాలకు దిగారు.

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు పని చేస్తే ఆ తర్వాత ఇబ్బందిపడతారని హరీశ్ రావు హెచ్చరించారు. పోలీసులు రాజ్యాంగానికి, చట్టానికి లోబడి పని చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతంగా ఉంటుందని భావించవద్దన్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఆయనను పోలీసులు విడుదల చేశారు.

రేవంత్ రెడ్డి పాలన ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు చెబుతున్న మార్పు… నిర్బంధాలు, అక్రమ అరెస్టులు, రాజ్యాంగ ఉల్లంఘనలేనని ఎద్దేవా చేశారు. పోలీస్ స్టేషన్లన్నీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మారిపోయాయని విమర్శించారు. ఎఫ్ఐఆర్‌లు పోలీస్ స్టేషన్లలో కాకుండా గాంధీ భవన్‌లో తయారవుతున్నాయని హరీశ్ రావు ఆరోపించారు. ఈ అరెస్టులను ప్రతిపక్షం బాగానే వినియోగించుకుందని చెప్పాలి.

అలాగే ఏపీలో కూడా..

ఏపీలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి పక్షమైన వైసీపీపై తీవ్రమైన ఆరోపణలు.. అంతటితో ఆగకుండా దాడులు, అరెస్టుల పర్వం సాగుతోంది. నిజానిజాలు ఏమైనా జరుగుతున్నపరిణామాలైతే వాస్తవమేనని పలువురు నేతలు చెప్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడ్డారని ఇప్పటికే కొందరు నేతలపై కేసులు పెట్టింది కూటమి ప్రభుత్వం . కొందరైతే అరెస్టయ్యారు. మరి కొందరు కోర్టులు, పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు.

సోషల్ మీడియానే టార్గెట్..

ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది. ఇప్పటికే చాలా మందిపై దాడులకు దిగారని ఆ పార్టీ ఆరోపిస్తోంది. మరి కొంతమందిని భయపెట్టినట్టుకూడా చెప్తున్నారు. ఇటీవల ప్రముఖ సినీ నటుడు, రచయిత పోసాని కాని, జగన్ కు మంచి ఫ్యాన్ గా ఉండే శ్రీరెడ్డి లాంటి వాళ్లు అందుకే యూ టర్న్ తీసుకున్నారనేది అర్థం అవుతోంది. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలానికి చెందిన అలజంగి యగ్నేశ్ అనే విద్యార్థిపైనా, తాజాగా గురువారం పల్నాడుకు అమరావతికి చెందిన కంబంపాటి దినేష్ పై కేసు నమోదైంది.

రెండు రాష్ట్రాలలోను కొనసాగుతున్న అరెస్టులు, నిర్భంధాల పరంపర ఎక్కడికి దారితీస్తుంది? ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య వాతావరణం పాడవుతుందా? కనీసం పొలిటికల్ స్ట్రాటెజీలు లేకనే ఇలా ప్రవర్తిస్తున్నారా? అనే ప్రశ్నలు ప్రజల్లో మెదులుతున్నాయి.