Rahul Gandhi Serious: అగ్రరాజ్యం అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ రీసెర్చ్ మరోసారి నివేదికను బయటపెట్టడంతో భారత్ లో మరోసారి రాజకీయ దుమారం చెలరేగుతోంది. సెబీ ఛైర్ పర్సన్ మధాబీ పూరి భుచ్ పై హిండెన్ బర్గ్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదికపై కాంగ్రెస్ తో పాటు ఇతర విపక్ష పార్టీలన్నీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ సెబీ యొక్క సమగ్రత తీవ్రంగా రాజీ పడిందన్నారు. ఆరోపణపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు భయపడుతున్నారనే విషయాన్ని హిండెన్ బర్గ్ నివేదిక స్పష్టంగా తెలియజేస్తుందని తెలిపారు. సెబీ ఛైర్ పర్సన్ ఎందుకు రాజీనామా చేయలేదో దేశ వ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు తెలుసుకోవాలనుకుంటున్నారని వెల్లడించారు. పెట్టుబడిదారులు తమ సొమ్మును పోగొట్టుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సెబీ ఛైర్ పర్సన్, గౌతమ్ అదానీ జవాబుదారీగా ఉంటారా అని ఆయన ప్రశ్నించారు. అయితే అదానీ సంస్థకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి సెబీ ఇష్టపడకపోవడానికి కారణం మధాబీ బుచ్ కి అదానీ గ్రూపులో వాటాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తూ హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదికను విడుదల చేసింది. మరోవైపు మధాబీ పూరి బుచ్ తో తమకు ఎటువంటి సంబంధాలు లేవని అదానీ గ్రూప్ వెల్లడించింది.