Telangana New Tagline: తెలంగాణ రాష్ట్రాన్ని ఇకపై తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ గా పిలుద్దామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, నెట్ జీరో సిటీ వంటి ప్రతిష్మాత్మక ప్రాజెక్టులతో రాష్ట్రం ‘ ది ఫ్యూచర్ స్టేట్ ’ కు పర్యాయపదంగా నిలుస్తుందని తెలిపారు.
అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కాలిఫోర్నియాలోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెక్ యూనికార్న్స్ సీఈఓలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన ఐటీ యూనికార్న్ ప్రతినిధులు తెలంగాణ రాష్ట్రానికి రావాలని ఆహ్వానించారు. అనంతరం అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
న్యూయార్క్, న్యూ జెర్సీ, వాషింగ్టన్ డీసీ, టెక్సాస్ లో పర్యటించామన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉన్నామని తెలిపారు. అమెరికాలో ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక లక్ష్యం.. అదేవిధంగా ఆ లక్ష్యాన్ని సూచించే నినాదం ఉందన్నారు. అవుటాఫ్ మెనీ.. వన్ అనేది న్యూయార్క్ స్టేట్ నినాదమని పేర్కొన్నారు. కాలిఫోర్నియాకు యురేకా అనే నినాదం ఉందన్న రేవంత్ రెడ్డి ఇకపై తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక లక్ష్య నినాదాన్ని ట్యాగ్ లైన్ గా పెట్టుకుందామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రాన్ని తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ గా పిలుద్దామని ప్రకటించారు. ప్రపంచ టెక్ పరిశ్రమలకు తెలంగాణలో అనుకూలమైన వాతావరణం ఉందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.