Telangana Politics: తెలంగాణలో పొలిటికల్ లీగల్ వార్.. శృతి మించుతున్న మాటల యుద్ధం..!

తెలంగాణలో నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది.  అధికార పక్షం మరో వైపు ప్రతిపక్ష నాయకులు సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య విమర్శ ప్రతివిమర్శల మంటలు రాజుకుంటున్నాయి. అలాగే బీజేపీ నాయకులు కూడా  పలు అంశాలపై ఆరోపణలకు దిగుతున్నారు.  ఒకరిపై మరొకరు లీగల్ నడుస్తోంది. తమపై చేసిన ఆరోపణలకు ప్రతిగా లీగల్ నోటీసులు కూడా ఇచ్చుకొనే పరిస్థితి నెలకొంది. కొంతకాలంగా ఈ లీగల్ నోటీసుల పర్వం గట్టిగానే సాగుతోంది. అయితే లీగల్ నోటీసులు ఇచ్చిన, తీసుకున్న నాయకుల జాబితాలో కేటీఆర్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

తనపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారంటూ బండి సంజయ్‌కు లీగల్ నోటీసులు పంపారు కేటీఆర్. తనపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని లేకపోతే లీగల్‌గా తాను తీసుకునే చర్యలు ఎదుర్కోవాలని సూచించారు.  అయితే తాను ఈ వ్యవహారంలో కేటీఆర్‌తో లీగల్‌గానే పోరాడతానని బండి సంజయ్ ప్రకటించారు. దానికి  తాను కూడా సిద్ధమేనని మరోసారి రియాక్ట్ అయ్యారు కేటీఆర్.

ఇక కొద్దిరోజుల క్రితం మంత్రి సురేఖ తనపై చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ ఆమెపై పరువు నష్టం దావా వేసిన కేటీఆర్.. బుధవారం ఈ కేసుకు సంబంధించిన వాంగ్మూలం ఇచ్చేందుకు నాంపల్లి స్పెషల్ కోర్టుకు హాజరయ్యారు. కొండాసురేఖ వ్యాఖ్యల వీడియోను కోర్టుకు సమర్పించిన కేటీఆర్ కోర్టుకు తన వాంగ్మూలాన్ని సమర్పించారు. అలాగే  అమృత్‌ పథకం టెండర్ల విషయంలో తన పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలుచేసినందుకు  కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ పార్టీకి సృజన్‌ రెడ్డి గతనెలలో నోటీసులు ఇచ్చారు. తప్పుడు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని సృజన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. సీఎం రేవంత్ తన బావమరిదితో లీగల్ నోటీసు పంపితే మాట్లాడటం ఆపబోమని కామెంట్ చేశారు. బావమరిదికి అమృతం పంచి, పేదలకు విషం ఇస్తుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఇలా పొలిటికల్ వార్ నడుస్తోంది.