హైదరాబాద్: కొత్తపేట ప్రాంతానికి చెందిన ఒక మహిళ అనుమానాస్పద మరణం సంచలనం రేపింది. భర్త,ఆమెతో గొడవపడ్డం ఇరుగుపొరుగు గమనించారు. అదంతా మామూలే అనుకున్నారు. కానీ గట్టిగా కేకలు వినిపించడంతో వెళ్లి చూస్తే, ఆమె ఒళ్లంతా గాయాలతో రక్తం మడుగులో పడి ఉంది. భర్త చేతికి గాయాలయ్యాయి. వెంటనే 108కు పిలిపించిన స్థానికులు, ఇద్దరినీ హాస్పిటల్‌కు తరలించారు. కానీ అప్పటికే సోనీ చనిపోయినట్టు వైద్యులు నిర్దారించారు. దీంతో సమాచారం అందుకున్న అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దీంతో అసలు బండారం బయటపడింది. ఏం జరిగిందని ఆరా తీస్తే, ముసలి కన్నీరు కార్చాడు. మాటా మాటా పెరిగి తనపై కత్తితో దాడి చేసి, తనకు తాను పొడుచుకుని చనిపోయిందని నమ్మబలికాడు. కానీ ఆమె వీపు భాగంపై కత్తిపోటు గాయాలు స్పష్టంగా వుండడం గమనించారు పోలీసులు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే, అసలు నిజం బయటపడింది.
ఇక వీరి కుటుంబం ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వలస వచ్చి కొత్తపేటలో వుంటున్నారు. కానీ గత కొన్ని నెలలుగా భార్యను అనుమానిస్తూ గొడవపడేవాడు. తాగొచ్చి కొట్టేవాడు. ఈక్రమంలోనే పంజాబీ డ్రెస్ ఎందుకు వేసుకున్నావని గొడవ పడ్డాడు. దీంతో ఏకంగా నిండు ప్రాణం తీసేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని రిమాండ్‌కు తరలించారు.