Sonbhadra: ఉత్తరప్రదేశ్‌లో గిరిజన యువకుడి  నోట్లో మూత్రం పోసి చిత్రహింసలు

ఉత్తరప్రదేశ్‌లో అమానవీయ ఘటనలు అధికమయ్యాయి.  సోనభద్రలో తాజాగా మరో దారుణమైన ఘటన చోటుచేసుకుంది.  ఓ గిరిజన యువకుడిపై దాడిచేసిన కొందరు యువకులు అతడి తల,  ముఖంపై నోట్లోనూ మూత్రం పోసి చిత్రహింసలకు గురిచేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యువకుడిని కొడుతూ, తన్నుతూ దారుణంగా హింసించిన దుండగులు ఆపై మూత్రం పోయడం ఆ వీడియోలో కనిపిస్తుంది.

నిందితులపై చర్యలు తీసుకోవాలని బాధిత యువకుడి సోదరుడు శివకుమార్ ఖర్వార్ కోరాడు. ఈ వీడియోను షేర్ చేసి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, డీజీపీని ట్యాగ్ చేశాడు. బాధితుడు పవన్ ఖర్వార్‌పై దాడిచేసిన అంకిత్, మరో ఏడుగురు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారు. సెప్టెంబర్ 26న శక్తినగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.

కొందరు యువకులు బాధితుడు పవన్‌ను చుట్టుముట్టి దాడిచేశారు.  ఆపై వారిలో ఒకడు బాధితుడిపై మూత్రం పోశాడు. తనను వదిలేయాని పవన్ వేడుకున్నా  అతడి అభ్యర్థనను పట్టించుకోని నిందితులు అతడిపై మూత్రం పోస్తూ ఆ ఘటనను వీడియో తీశారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడు అంకిత్‌ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం గాలిస్తున్నారు.   ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రలో ఇలాంటి ఘటన జరగడం ఈ ఏడాది ఇది రెండోసారి.