Araku Locations: అరకు అందాలు తనివితీరా చూడాల్సిందే . ..

ఆంధ్రా కాశ్మీర్ గా పేరొందిన అరకు అందాలు ప్రకృతి ప్రేమికులు చూసి తీరాల్సిందే .ప్రకృతి సౌందర్యానికి నెలవైన అరకులోయ అందాలను వర్ణించాలంటే మాటలు చాలవు .    మంచుదుప్పటి కప్పుకున్న  సోయగాలు, చినుకు తడికి మెరిసిపోయే పచ్చదనం, గిరిజన జీవన విధానాన్ని ప్రతిబింబించే ట్రైబల్ కల్చర్ . .. పురాతన  వ్యవసాయ పద్ధతులు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో విశేషాలు. కుటుంబ సభ్యులతో  కలిసి సంతోషంగా హాలిడేను ఆస్వాదించేందుకు దీనికి మించిన ప్రదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొకటి లేదనే చెప్పాలి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన నగరమైన విశాఖపట్నం సందర్శనకు వచ్చే టూరిస్టులెవరైనా అరకులోయను సందర్శించకుండా వెళ్లరు. నగర పర్యటన ముగించుకున్న తరువాత హిల్ స్టేషన్ కు పయనమయ్యేందుకు  టూరిస్టులు ఆసక్తి చూపుతారు. విశాఖపట్నం నగరానికి 114 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో అరకులోయ హిల్ స్టేషన్ ఉంటుంది. పర్వత శ్రేణుల నడుమ ఒదిగి ఉన్న ఈ ప్రాంతం ప్రకృతి రమణీయతకు ఆలవాలం. అరకులోయ కేవలం పర్యాటక కేంద్రంగానే కాదు.. లొకేషన్ల పరంగా సినిమా షూటింగ్ లకు కూడా గమ్యస్థానంగా నిలుస్తుంది.

వైజాగ్ నుంచి అరకు వరకు చేసే రైలు ప్రయాణం కూడా సరికొత్త అనుభూతిని ఇస్తుంది. అక్కడ సొరంగాలు, వంతెనలు, ప్రకృతి దృశ్యాల్ని చూస్తూ సాగే ఆ జర్నీ జీవితాంతం గుర్తుంటుంది. అందుకోసమే ఒక్కరోజులోనే.. అరకు చూసివచ్చేందుకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) స్పెషల్ ప్యాకేజీ తీసుకొచ్చింది. విశాఖపట్నం నుంచి అరకు వెళ్లే రైలు రోజూ అందుబాటులో ఉంది. మీ ప్రయాణానికి అనుగుణంగానే టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. వీకెండ్‌లో ఎటైనా వెకేషన్‌కు వెళ్లాలనుకునే వారు ఈ ప్యాకేజీపై లుక్కేయొచ్చు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు ముందురోజే వైజాగ్ చేరుకోవాల్సి ఉంటుంది.

ట్రైన్ జర్నీ ఇలా..

వైజాగ్‌లో ఉదయం 6.45 గంటలకు నం: 08551 రైలు బయల్దేరుతుంది. 10.55 గంటలకు అరకు చేరుకుంటారు. అరకు స్టేషన్ నుంచి ముందుగా అరకు లోయకు వెళ్తారు. అక్కడి అందాల్ని వీక్షించిన తర్వాత ఆదివాసీ మ్యూజియం, గార్డెన్స్, చాపరాయి సందర్శిస్తారు. అక్కడ భోజనం పూర్తి చేసి తిరిగి వైజాగ్ పయనమవుతారు. తిరుగు ప్రయాణం రోడ్ మార్గంలో ఉంటుంది. అనంతగిరి కాఫీ తోటలు, బొర్రా గుహలు, గాలికొండ వ్యూ పాయింట్ వీక్షణ ఉంటుంది. తర్వాత వైజాగ్ రైల్వే స్టేషన్, సిటీ లిమిట్స్‌కు చేరుకోవడంతో మీ జర్నీ ముగుస్తుంది.

అరకు టూర్ వెళ్లి వచ్చేందుకు ట్రైన్ టికెట్లు (స్లీపర్, ఎకానమీ క్లాస్ ఎంపికను బట్టి) ప్యాకేజీలో భాగంగానే ఉంటాయి.
ప్యాకేజీలో పేర్కొన్న స్థలాల్ని వీక్షించేందుకు AC బస్సు ఫెసిలిటీ ఉండదు.
మార్నింగ్ అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, తేనీరు IRCTC నే అందిస్తుంది.
బొర్రా గుహల దర్శనం రుసుం ప్యాకేజీలో అంతర్భాగమే.
మిగతా చోట్ల ఎక్కడైనా ఎంట్రీ ఫీ, ఫొటోలు, వీడియో రుసుములు వంటివి ప్రయాణికులే చెల్లించాల్సి ఉంటుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్ సదుపాయం కూడా ఉంటుంది.