టాటా గ్రూప్‌లో చేరిన వెంటనే రతన్ టాటాను పెద్ద పదవులు వరించలేదు. ప్రారంభంలో ఓ కంపెనీలో సాధారణ ఉద్యోగిగా పనిచేశాడు. అలా వివిధ టాటా గ్రూప్ వ్యాపారాలలో అనుభవం సంపాదించాడు. ఆ తర్వాత 1971లో నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీకి ఇన్‌ఛార్జ్ డైరెక్టర్‌గా నియమించబడ్డాడు. ఇక ఆ తర్వాత రతన్ వెనుదిరిగి చూసింది లేదు. టాటా గ్రూప్ సంస్థల్లో అనేక సంస్కరణలు చేపట్టాడు. ప్రతిభావంతులైన యువతను తీసుకురావడం ద్వారా వ్యాపారాన్ని వేగవంతం చేయడానికి ప్రయత్నించారు. కొద్ది కాలంలోనే గ్రూప్‌లోని చాలా కంపెనీలు విజయానికి బాటలు పడ్డాయి. ఆ తర్వాత పదేళ్లకు టాటా ఇండస్ట్రీస్ ఛైర్మన్ అయ్యారు. 1991లో తన మామ JRD టాటా తర్వాత టాటా గ్రూప్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. JRD టాటా ఐదు దశాబ్దాలకు పైగా ఈ పదవిలో ఉన్నారు. 1868లో ఒక చిన్న వస్త్ర వ్యాపార సంస్థగా ప్రారంభమైన టాటా గ్రూప్ ఆ తర్వాత ఉప్పు నుంచి ఉక్కు, కార్లు, సాఫ్ట్‌వేర్, పవర్ ప్లాంట్లు, విమానయాన సంస్థల వరకు వ్యాపారాలు విస్తరించాయి. రతన్ టాటా నాయకత్వంలో టాటా గ్రూప్ ఎన్నో శిఖరాలను అధిరోహించింది.