ముంబై: రతన్ టాటా మరణానంతరం ఆయనకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని వివిధ వర్గాల నుంచి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలనే ప్రతిపాదనకు మహారాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రతన్ టాటా కృషికిగానూ భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరే ప్రతిపాదనను కూడా ఆమోదించినట్లు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తెలిపారు. త్వరలోనే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది.
కాగా దేశం గర్వించే వ్యాపారవేత్త రతన్ టాటాకు ‘భారత రత్న’ పురస్కారం ఇస్తే బాగుండేదని గతంలోనూ చర్చసాగింది. కానీ రతన్ టాటా మాత్రం అలాంటివాటిని సున్నితంగా తిరస్కరించేవారు. ‘భారతరత్న’ ఇవ్వాలని సోషల్ మీడియాలో జరుగున్న ప్రచారాన్ని వెంటనే ఆపేయాలని మూడేళ్ల క్రితం సోషల్ మీడియాలో ఆయన స్వయంగా పోస్టు చేసి, నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు కూడా.