Fake Court: గుజరాత్ లో నకిలీ కోర్టు.. ఐదేళ్లుగా తీర్పులు

ఓ వ్యక్తి ఏకంగా నకిలీ కోర్టునే ఏర్పాటు చేశాడు. అంతటితో ఆగకుండా తానే జడ్జి అంటూ ఆ ఏరియాలో చాలా మందిని నమ్మించగలిగాడు .   అదీ ఒకరోజు ,  రెండ్రోజులు కాదు . . ఏకంగా ఐదేళ్లు .    కొందరికి అనుకూలంగా తీర్పులు ఇస్తూ.. భారీగా వసూళ్లకు పాల్పడ్డాడు .     ఓ కేసు విషయంలో ఏకంగా ఓ జిల్లా కలెక్టర్‌కే ఉత్తర్వులు జారీ చేసాడు ఈ నకిలీ జడ్జి .   ఇక్కడే అతడి పాపం పండింది .   ఆ ఉత్తర్వులను క్షుణ్ణంగా పరిశీలించడంతో.. అవి కాస్తా నకిలీ ఉత్తర్వులు అని తేలింది. దీంతో తీగ లాగితే మొత్తం డొంకంతా కదిలింది. నకిలీ కోర్టుతోపాటు నకిలీ జడ్జి గురించి విన్న పోలీసులు, అధికారులు  షాక్ అయ్యారు. గుజరాత్‌లో జరిగిన ఈ ఘటన జాతీయ స్థాయిలో  ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన మోరిస్ శామ్యూల్ క్రిస్టియన్ అనే వ్యక్తి.. ఏకంగా కోర్టును ఏర్పాటు చేసి.. తానే జడ్జి అంటూ కొందరిని   నమ్మించాడు. ఈ క్రమంలోనే అహ్మదాబాద్ సిటీ సివిల్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలకు సంబంధించిన కేసులను సేకరించి.. వారిని బుట్టలోకి దింపాడు. ఓ నకిలీ ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి.. దాని ముందుకు కోర్టులో పెండింగ్ కేసులతో సతమతం అవుతున్న వారిని పిలిపించుకున్నాడు.ఆ తర్వాత నకిలీ విచారణ చేపట్టి.. అందులో కొందరికి అనుకూలంగా తీర్పులు కూడా ఇచ్చేశాడు. వారికి అనుకూల తీర్పులు ఇచ్చి.. ప్రతిఫలంగా వారి నుంచి భారీగా డబ్బులు దండుకునేవాడు. కేసు స్థాయిని  బట్టి.. పిటిషనర్ల వద్ద డబ్బులు వసూలు చేసేవాడు. ఇక ఎవరికీ అనుమానం రాకుండా కోర్టు లాగా ఆఫీస్‌ను తయారు చేశాడు. పైగా నకిలీ సిబ్బందిని, లాయర్లను కూడా నియమించుకున్నాడు .  ఈ నకిలీ వ్యవహారాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే 2019 కి సంబంధించి . .. ఓ ప్రభుత్వ భూమికి సంబంధించిన కేసులో.. తాజాగా ఓ వ్యక్తికి అనుకూలంగా తీర్పునిచ్చాడు. ఈ తీర్పు వెలువరించే సమయంలో ఏకంగా జిల్లా కలెక్టర్‌కే ఉత్తర్వులు జారీ చేశాడు. అయితే ఆ ఉత్తర్వులు నకిలీవి అని కోర్టు రిజిస్ట్రార్ గుర్తించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, అధికారులు.. మోరిస్ శామ్యూల్‌ క్రిస్టియన్ బండారం మొత్తం బయటికి వచ్చింది.కోర్టు రిజిస్ట్రార్‌ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.   గత ఐదేళ్లుగా మోరిస్ శామ్యూల్ క్రిస్టియన్ ఎన్నో   కార్యకలాపాలు నిర్వహించినట్లు తేటతెల్లమయింది .  ఐదేళ్లపాటు యదేచ్చగా నకిలీ కోర్టును నిర్వహించిన ఘనుడి బ్యాక్ గ్రౌండ్ పరిశీలిస్తే . . 2015లోనే ఇతగాడిపై కేసులు నమోదైనట్లు తెలిసింది .