దేశరాజధాని ఢిల్లీలో గాలిలో నాణ్యత రోజురోజుకు క్షీణిస్తోంది. మంగళవారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (గాలి నాణ్యత సూచిక) ఏకంగా 494కు పెరిగింది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. ఈ నేపథ్యంలో స్ట్రిక్ట్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ)-4 ఆంక్షలు అమలు చేస్తున్నారు. గాలి నాణత్య సూచీ 450కు తగ్గినా సరే తమ అనుమతి లేకుండా ఆంక్షలు ఎత్తివేయవద్దని అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈ ఉదయం గాలి నాణ్యత సూచీ ఏకంగా 500 మార్కును చేరుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.
ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న స్టేజ్-4 ఆంక్షల ప్రకారం.. నిత్యావసరాలతోపాటు ఎల్ఎన్‌జీ, సీఎన్‌జీ, బీఎస్-6 డీజిల్, ఎలక్ట్రిక్ వాహనాలు మినహా ఇతర ట్రక్కులు, వాహనాలు నగరంలోకి ప్రవేశించేందుకు అనుమతి లేదు. ఢిల్లీ వెలుపల రిజిస్టర్ అయిన తేలికపాటి వాణిజ్య వాహనాలకు కూడా అనుమతి లేదు. అయితే, అవి ఎలక్ట్రిక్ వాహనాలు అయితే మాత్రం అనుమతిస్తారు. నిర్మాణ పనులు, పబ్లిక్ ప్రాజెక్టులను పూర్తిగా నిలిపివేశారు. పొగమంచు దట్టంగా కురుస్తున్నప్పటికీ రైలు సర్వీసులు కొనసాగుతున్నాయి. అయితే, 22 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా, కాలుష్యం కారణంగా 9 రైళ్లను రీషెడ్యూల్ చేశారు.