Dawood Ibrahim: శరద్ పవార్.. దావూద్ ఇబ్రహీంను  కలిశారు: ప్రకాశ్ అంబేడ్కర్  

మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ దుబాయ్ లో కలిశారని వంచిత్ బహుజన్ అఘాడీ పార్టీ అధ్యక్షుడు ప్రకాశ్ అంబేడ్కర్  సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుడు దావూద్ పవార్ కు బంగారు చెయిన్ గిఫ్ట్ గా ఇచ్చారని చెప్పడం కీలకంగా మారింది.

1988 – 1991 మధ్య కాలంలో శరద్ పవార్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుందని అంబేడ్కర్ చెప్పారు.  ఆయన అధికారికంగా విదేశీ పర్యటనలో భాగంగా తొలుత లండన్ కు వెళ్లారని, అక్కడి నుంచి కాలిఫోర్నియాకు, అనంతరం కాలిఫోర్నియా నుంచి లండన్ కు తిరిగొచ్చారని… లండన్ లో రెండు రోజుల పాటు బస చేసిన తర్వాత దుబాయ్ కు వెళ్లారని వెల్లడించారు.

దుబాయ్ ఎయిర్ పోర్టులో శరద్ పవార్ ను దావూద్ కలిశారని, పవార్ కు స్వాగతం పలికి, గోల్డ్ చెయిన్ ను  బహూకరించారని, అదే రోజు సాయంత్రం పవార్ లండన్ కు తిరుగుపయనమయ్యారని… రెండు రోజుల తర్వాత ఇండియాకు వచ్చారని ప్రకాశ్ అంబేడ్కర్ వెల్లడించారు.

విదేశీ ట్రిప్ కు కేంద్ర అనుమతిని పవార్ తీసుకున్నారా? అని ప్రశ్నించారు. అది అధికారిక పర్యటనా? లేక అనధికారిక పర్యటనా? అని అడిగారు. ఒకవేళ పవార్ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతిని ఇచ్చి ఉంటే… దావూద్ ను కలవడానికి కూడా అప్పటి కేంద్ర ప్రభుత్వం అనుమతిని ఇచ్చినట్టేనని వ్యాఖ్యానించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని కోరారు.

ప్రకాశ్ అంబేడ్కర్ ఆరోపణలపై ఎన్సీపీ (ఎస్పీ) మండిపడింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు… బీజేపీకి మేలు చేయడానికి  అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ మనవడే ప్రకాశ్ అంబేడ్కర్ అన్న విషయం చాలామందికి తెలిసిందే..