పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఇవాళ పుట్టిన రోజు కావడంతో ఫ్యాన్సు వేడుకలు షురూ చేశారు . ప్రభాస్ కు నేటితో 45 ఏళ్లు నిండి 46వ వసంతంలోకి అడుగుపెట్టాడు. అనతికాలంలోనే దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. బాహుబలి, బాహుబలి-2, సలార్, కల్కి 2898 ఏడీ వంటి బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్లతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. కలెక్షన్ ల సునామీలు సృష్టిస్తున్నాడు. తెలుగు-తమిళ రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తరాదిలోనూ తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. అందుకే ప్రభాస్ సినిమాలకు పెట్టుబడి విషయంలో నిర్మాతలు ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు.
2024లో ప్రభాస్ రెండు భారీ హిట్లు అందుకున్నాడు. తొలుత సలార్‌తో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా రూ.618 కోట్లు రాబట్టాడు. ఆ తర్వాత విడుదలైన ‘కల్కి 2898 ఏడీ’తో నిర్మాతలకు వసూళ్ల వర్షం కురిపించాడు. ప్రభాస్-దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్ వంటి దిగ్గజాలు నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1042.25 కోట్లు వసూలు చేసింది. ఈ భారీ హిట్ల తర్వాత ప్రభాస్ చేతిలో ప్రస్తుతం మరో ఐదు భారీ సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలన్నింటి బడ్జెట్ కలిపి రూ.2,100 కోట్లు పైగానే ఉండొచ్చంటూ కథనాలు వెలువడుతున్నాయి. ఇందులో ఏ సినిమాకీ రూ.300 కోట్ల కంటే తక్కువ బడ్జెట్ లేదని, ఒక సినిమాకు గరిష్ఠంగా రూ.700 కోట్ల వరకు బడ్జెట్ ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.