వియత్నాం దేశంలో యాగి తుపాను పెను విధ్వంసాన్ని సృష్టించింది. వియత్నాం ఉత్తర ప్రాంతంలో భారీ వర్షాల ధాటికి ఆకస్మిక వరదలు సంభవించి పర్వత ప్రాంతంలో ఉన్న ఓ గ్రామం మొత్తాన్ని కకావికలమైంది . . ఈ తుపాను కారణంగా 141 మంది పౌరులు మరణించినట్లు సమాచారం . కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగానే ఎక్కువగా మరణాలు సంభవించాయి.
యాగి తుపాను కారణంగా ”లాంగ్ నౌ” అనే గ్రామం మొత్తం ధ్వంసమైంది. ఆ గ్రామంలో నివాసం ఉంటున్న 35 కుటుంబాలు మట్టి చరియలు, శిథిలాల కింద చిక్కుకుపోయాయి. ఇప్పటి వరకు 16 మృతదేహాలను సహాయ సిబ్బంది వెలికి తీయగా, 40 మంది గల్లంతయ్యారు. 12 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఇక ఉత్తర వియత్నాంలోని ఫుథో ప్రావిన్స్‌లో రెడ్ నదిపై నిర్మించిన ఉక్కు వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో 10 కార్లు, ట్రక్కులు, రెండు బైక్‌లు నీళ్లలో పడిపోయాయి. అతిపెద్ద తుపాను ఇదే
ఈ తుపాను శనివారం వియత్నాం తీరం దాటగా, ఆ సమయంలో అక్కడి ఉత్తర తీర ప్రాంతాలు వణికిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల 30లక్షల మందికి పైగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. కొన్ని దశాబ్దాల తర్వాత ఈ ప్రాంతాన్ని తాకిన అత్యంత శక్తిమంతమైన టైఫూన్లలో ఒకటిగా యాగి తుపాన్ వియత్నాం అని అధికారులు అభివర్ణించారు. గంటకు 149 కిలోమీటర్ల వేగంతో గాలులు వీశాయి. నదులన్నీ ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. రాజధాని హనోయి గుండా ప్రవహించే రెడ్ రివర్‌తో సహా పలు నదుల్లో నీటి మట్టాలు ప్రమాదకరంగా ఉండడం వల్ల అధికారులు సమీపంలో నివసించే ప్రజలను ఖాళీ చేయించారు. వియత్నాంలో జనాభాపరంగా రెండో అతిపెద్ద నగరమైన హనోయ్‌లో 2008 తర్వాత అంత భారీ స్థాయిలో వరదలు సంభవించాయి.