Russia Ukraine Conflict:రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని భారత్ ఆపగలదు: ఇటలీ ప్రధాని మెలోనీ

మూడేళ్ళుగా కొనసాగుతున్న యుద్దాన్ని భారత్ మాత్రమే ఆపగలదు . . ఈ విషయాన్నీ ప్రపంచం గుర్తించింది .

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరించడంలో భారత్, బ్రెజిల్‌, చైనాలు కీలక పాత్ర పోషిస్తాయని తాను విశ్వసిస్తున్నట్లు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని అన్నారు. అంతేకాదు రష్యా-ఉక్రెయిన్‌ వివాదాన్ని పరిష్కరించి శాంతి స్థాపన చేయడానికి భారత్, చైనా సహకరించాలని కోరారు. ఉత్తర ఇటలీ,సెర్నోబియో నగరంలోని అంబ్రోసెట్టి ఫోరమ్‌లో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోడిమిర్ జెలెన్‌స్కీతో మెలోని భేటీ అయ్యారు.ఈ సందర్భంగానే రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరించడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని ఆమె అన్నారు. ఉక్రెయిన్ సంక్షోభాన్ని నివారించడంలో భారత్ చేస్తున్న ప్రయత్నాలపై రష్యా అధినేత పుతిన్ కీలక వ్యాఖ్యలు చేసిన రెండు రోజులు తర్వాత మెలోనీ నుంచి ఈ కామెంట్స్ రావడం గమనార్హం.

భారత్ సహకారంతో
గురువారం వ్లాడివోస్టాక్‌లో జరిగిన 9వ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రసంగించారు. ఉక్రెయిన్ సమస్యను పరిష్కరించడంలో భారత్ తన వంతు సహకారం అందిస్తోందని అన్నారు. “మేము మా స్నేహితులను, భాగస్వాములను గౌరవిస్తాం. వారు ఈ ఘర్షణలను, సమస్యలను పరిష్కరించడంలో చిత్తశుద్ధితో ఉన్నారని నేను నమ్ముతున్నాను. సమస్య పరిష్కారం కోసం నేను నిరంతరం భారత్‌, చైనా, బ్రెజిల్‌ దేశాలతో సంప్రదిస్తున్నాను” అని పుతిన్‌ అన్నారు.

దౌత్యంతోనే పరిష్కారం
ఇటు రష్యా, అటు ఉక్రెయిన్‌లతో ఏకకాలంలో స్నేహం చేసే దేశంగా భారతదేశానికి పేరుంది. ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చర్చలు, దౌత్య మార్గాల్లో సమస్యను పరిష్కరించుకోవాలని భారత్‌ పదేపదే నొక్కి చెబుతోంది. ప్రధాని మోదీ వరుసగా మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత రష్యా, ఉక్రెయిన్‌లలో పర్యటించారు. యుద్ధ నివారణ కోసం శాంతి చర్చల్లో తన మిత్రులకు అండగా భారత్‌ నిలుస్తుందని చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో దిల్లీ తటస్థంగా లేదా ఉదాసీనంగా ఉండదని, తాము ఎల్లప్పుడూ శాంతి పక్షాన ఉంటామని కీవ్‌ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీతో అన్నారు. ఈ పర్యటన తర్వాత ప్రధాని మోదీ, పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. భారత్  ప్రధాని మోదీ ఇటీవల చేసిన  ప్రయత్నాలను అమెరికా అభినందించింది.