చైనా వైరస్ . . డేంజర్ కాదా ?

చైనాలో వ్యాపిస్తున్న హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) ప్రమాదమా ? కాదా ? ఇది ఏమంత డేంజర్ కాకపోయినా . . సోషల్ మీడియాలో మాత్రం భయాన్ని ప్రేరేపిస్తున్నారు .

ఈ వైరస్ గురించి . . భారత్ కీలక ప్రకటన చేసింది. ఈ వైరస్ ఎలాంటిది, దీని వ్యాప్తి ఇండియాలో ఉంటుందా లేదా అనే విషయాలను ప్రకటించారు. భయం అక్కర్లేదు కానీ . కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి .

చైనాలో వ్యాపిస్తున్న కొత్త వైరస్ (ChinaVirus) హ్యూమన్ మెటాప్‌ న్యూమో వైరస్ (HMPV) గురించి భారత్ అప్రమత్తమైంది. ఇది “జలుబు కలిగించే ఇతర శ్వాసకోశ వైరస్ లాగా” ఉందని పేర్కొంది. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ (DGHS) డాక్టర్ అతుల్ గోయల్ అన్నారు. ఇది సాధారణ జలుబుకు కారణమవుతుందని, ప్రధానంగా యువత, వృద్ధులలో ఫ్లూ వంటి లక్షణాలను కలిగిస్తుందని ఆయన తెలిపారు. ఈ వైరస్ వ్యాప్తిపై భయాందోళన చెందాల్సిన అవసరం లేదని అతుల్ గోయల్ స్పష్టం చేశారు.

దగ్గులు , తుమ్ములు . . ,

చైనాలో ఇటీవల HMPV వ్యాప్తికి సంబంధించిన నివేదికల నేపథ్యంలో డాక్టర్ గోయల్ కూడా భారతదేశంలో అసాధారణ పరిస్థితి లేదని సూచించారు. మేము డిసెంబర్ 2024 డేటాను విశ్లేషించామని, అలాంటి మార్పులు లేవన్నారు. చలికాలంలో శ్వాసకోశ వైరస్‌ సోకడం సహజమేనని, ఈ సమయంలో ఆసుపత్రులను సిద్ధం చేశామని ఆయన తెలిపారు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా సాధారణ జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ గోయల్ సాధారణ ప్రజలను కోరారు. దగ్గు, జలుబుతో బాధపడేవారు ఇతరులకు దూరంగా ఉండాలన్నారు. దగ్గినా, తుమ్మినా ప్రత్యేకంగా రుమాలు లేదా టవల్‌ను ఉపయోగించాలన్నారు.

WHO ఆదేశం..

చైనాలో పెరుగుతున్న hMPV వ్యాప్తి నేపథ్యంలో COVID-19 మాదిరిగానే ఇది కూడా మహమ్మారిగా వచ్చే అవకాశం ఉందని అనేక మంది భావిస్తున్నారు. అయినప్పటికీ చైనా మాత్రం వారి పారదర్శకతను సమర్థించుకుంది. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వ్యాధి మూలం గురించి మరింత డేటా, సమాచారాన్ని పంచుకోవాలని చైనాను కోరింది. తద్వారా ప్రపంచ స్థాయిలో దీని గురించి మరింత అవగాహన వచ్చే అవకాశం ఉందని తెలిపింది. భారతదేశంలో HMPV కేసులలో పెద్ద పెరుగుదల కనిపించనప్పటికీ, శ్వాసకోశ సంక్రమణకు సాధారణ నివారణ ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచించింది .