హనుమదనుగ్రహం . ..

హనుమదనుగ్రహం
పరిపూర్ణంగా కలగడానికి,
హనుమద్వైభవం అర్థం కావడానికి
సుందరకాండని ఎక్కువమంది ఆశ్రయిస్తారు.
కానీ శ్రీమద్రామాయణంలోని కిష్కింధ కాండ
ఈ విషయంలో మరింత ఎక్కువ దోహదం చేస్తుంది.
ఎందుకంటే శ్రీమద్రామాయణంలో
హనుమ ప్రవేశం జరిగేది….
ఆయన దివ్య వైభవం అవగతం అయ్యేది
ఈ కిష్కింధ కాండలోనే.
పైగా స్వామి హనుమ కు ఒక శాపం ఉంది…
తన శక్తి తనకు తెలియకుండా..!
అయితే ఆ శాపాన్ని పరిహరించే ఘట్టం
ఈ కిష్కింధ కాండ చరమాంకంలోనే ఉన్నది.
అంతే కాదు హనుమంతుడు రుద్రాంశ స్వరూపునిగా,
రామదూతగా ఆవిష్కృతం అయినది కూడా ఈ కాండలోనే.
సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు వానరవీరులందరినీ
తలొక దిక్కుకూ పంపేటపుడు
శ్రీరాముడు అంగుళీయకాన్ని
ఇచ్చినదే హనుమంతుడికి!
కేవలం హనుమంతుడే సీతమ్మను కనుగొనగలడని
రామునికి ఎందుకో.. ముందే నమ్మకం!
అది కిష్కింధకాండలోనే జరిగింది!
రామలక్ష్మణులు హనుమంతునిపై అధిరోహించి
సుగ్రీవుని వద్దకు పయనించడం తెలిసిందే.
వనవాసంలో శ్రీరాముడు
తొలిసారి అధిరోహింఛిన వాహనం హనుమద్వాహనమే!
హనుమంతుని సంభాషణ చాతుర్యాన్ని,
వాక్శుద్ధిని, అతడిలోని ఉన్నత మంత్రిత్వ ప్రతిభని
రాముడు గుర్తించేది, ప్రశంసించేది
కిష్కింధకాండలోనే..
అంతెందుకు శ్రీరామునితో
హనుమంతుని తొలి కలయిక
ఈ కిష్కింధకాండలోనే!   – దీక్షితుల సుబ్రమణ్యం .  సీ.జర్నలిస్ట్