తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రసాదం ప్రపంచవ్యాప్తంగా చలా ఫేమస్. ఇటీవల నాసిరకం నెయ్యి, ఇతర పదార్థాలు వినియోగిస్తున్నారు అనే వివాదం రేగిన విషయం తెలిసిందే. ఎంతో ప్రీతిపాత్రమైన ఈ లడ్డూ ప్రసాదాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో తాము స్వీకరించడమే కాకుండా ఇరుగుపొరుగు వారికి కూడా పంచడం ఆనవాయితీ. అందుకే తిరుమల వెళ్లినప్పుడు అవసరమైన సంఖ్యలో లడ్డూలు కొనుగోలు చేయాలని చూస్తుంటారు. కానీ టీటీడీ పరిమితి కారణంగా నిరాశే ఎదురవుతోంది. అయితే మున్ముందు భక్తులు అడిగినన్ని లడ్డూలు విక్రయించేందుకు టీటీడీ సమాయత్తమవుతోంది.
సిబ్బంది నియమించే దిశగా..
భక్తుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని టీటీడీ ఈ దిశగా కదులుతోంది. ఇందుకోసం మరో 74 మంది శ్రీవైష్ణవులు, 10 మంది శ్రీవైష్ణవేతరులను నియమించాలని నిర్ణయించింది. వీరి సాయంతో రోజుకు అదనంగా 50 వేల చిన్న లడ్డూలు, 4 వేల పెద్ద లడ్డూలు, 3,500 వడలు తయారు చేయాలనేది లక్ష్యం.
అందరికీ అన్ని లడ్డూలు సాధ్యమేనా..
వారాంతాలు, ప్రత్యేక పర్వదినాలు, బ్రహ్మోత్సవాల వేళల్లో లడ్డూలకు ఎక్కువ గిరాకీ ఉంటోంది. అందుకే అదనపు లడ్డూల తయారీకి టీటీడీ అడుగులు చేపట్టినట్టు సమాచారం. స్వామిని దర్శనం చేసుకున్న భక్తులకు ప్రస్తుతం ఒక చిన్న లడ్డూను ఉచితంగా అందిస్తున్నారు. సరాసరిన 70 వేల మంది ప్రతి రోజూ శ్రీవారిని దర్శించుకుంటున్నారు. అంటే రోజుకు 70 వేల ఉచిత లడ్డూలు ఇవ్వాల్సి ఉంటుంది. అదనపు తయారీ అందుబాటులోకి వస్తే అదనపు లడ్డూ ప్రసాదం కోరుకునే భక్తులకు విక్రయిస్తుంటారు.
ప్రస్తుతం రోజుకు 3.5 లక్షల చిన్న లడ్డూలు, 6 వేల పెద్ద లడ్డూలు (కల్యాణం లడ్డూ), 3,500 వడలను తయారు చేస్తోంది. వీటిని తిరుమలతో సహా చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, తిరుపతిలోని స్థానిక ఆలయాల్లోనూ విక్రయిస్తున్నారు. మొత్తం మీద అడిగినన్ని లడ్డూలు అందజేసే పనిలో టీటీడీ పడింది. అది కాని సాధ్యమైతే ఇంకేమి కావాలి.. అంతకు మించిన ఆనందమే లేదంటూ భక్తులు చెబుతున్నారు.