దేశంలోని కీలక నగరాలన్నీ కాలుష్యం బారిన పడుతున్నాయి. విశాఖలో సైతం కాలుష్య తీవ్రత పెరుగుతోంది. ఈ అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసెంబ్లీలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటామని పవన్ చెప్పారు. కాలుష్య నివారణపై పరిశ్రమల నిర్వాహకులతో మాట్లాడి సరైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పరిశ్రమలు వెదజల్లే కాలుష్యానికి కారణమైన బొగ్గు వాడకాన్ని తగ్గిస్తున్నామని పవన్ చెప్పారు. పలాసలో జీడిపప్పు తొక్క కాల్చడం ద్వారా పెద్ద ఎత్తున కాలుష్యం వెలువడేదని, ఇప్పుడు ఆ తొక్క ద్వారా ఆయిల్ సేకరించి ఆదాయాన్ని సమకూరుస్తున్నామని తెలిపారు. కొన్ని దశాబ్దాలుగా విశాఖలో పరిశ్రమల అభివృద్ధి జరుగుతోంది. దీంతో విశాఖ కాలుష్యానికి దగ్గరయిందని పవన్ అన్నారు. గత ప్రభుత్వం కాలుష్య నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. గాలి నాణ్యతను పెంచేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కాలుష్యం కారణంగా అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని అన్నారు. కాలుష్యం లేని అభివృద్ధికి తాము కృషి చేస్తామని చెప్పారు.