“టీటీడీలో లడ్డూల రేషనింగ్ బ్లాక్ మార్కెటింగ్ కి తోడ్పడుతుంది: కందారపు మురళి”
తిరుమల తిరుపతి దేవస్థానంలో నేటి నుంచి అమలు చేయాలని భావిస్తున్న లడ్డూల రేషన్ విధానం చివరకు బ్లాక్ మార్కెటింగ్ కి దోహదపడుతుందని టిటిడి ఉద్యోగ, కార్మిక సంఘాల గౌరవాధ్యక్షులు కందారపు మురళి ఓ ప్రకటనలో విమర్శించారు.
తిరుమల అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి చేసిన ప్రకటన సమంజసమైంది కాదని భక్తుల మనోభావాలకు భిన్నమైందని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
గత అనుభవాల దృష్ట్యా ఈ అంశాన్ని తాము తెలియజేస్తున్నామని గతంలో కూడా ఈ రేషన్ విధానం కారణంగా విపరీతమైన బ్లాక్ మార్కెటింగ్ ఏర్పడిన విషయాన్ని యాజమాన్యం మరిచిపోయినట్టుందని ఆయన గుర్తు చేశారు.
ఇప్పటికే తిరుమల కొండపై దళారుల దందా ఏ స్థాయిలో కొనసాగుతుందో క్యాబినెట్ సమావేశంలో ఓ మహిళా మంత్రి ముఖ్యమంత్రికి స్వయంగా ఫిర్యాదు చేసినా ఆ దందాకి బలం చేకూర్చేటట్టుగా టీటీడీ యాజమాన్యం ప్రకటనలు చేయటం ఏ రకంగాను సమంజసం కాదని తక్షణం ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు.