ప్రముఖ కన్నడ సినీ హీరో కిచ్చా సుదీప్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి సరోజ ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. 83 ఏళ్ల సరోజ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సరోజ మృతి పట్ల కన్నడ సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా సుదీప్ కు సానుభూతిని తెలియజేశారు. ఎక్స్ వేదికగా పవన్ స్పందిస్తూ… సుదీప్ గారి మాతృమూర్తి సరోజ గారు కన్నుమూశారని తెలిసి చాలా చింతించానని తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. తన నట జీవితంలో తల్లి ప్రభావం, ప్రోత్సాహం ఎంతో వున్నాయని తనతో సుదీప్ చెప్పారని గుర్తు చేసుకున్నారు. మాతృ వియోగం నుంచి సుదీప్ త్వరగా కోలుకోవాలని అన్నారు. సుదీప్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.