ATP: నసనకోట క్షేత్రంలో జరిగిన దోపిడీ 6.50కోట్లు

నసనకోట క్షేత్రంలో జరిగిన దోపిడీ 6.50కోట్లు

బుధవారం రోజు జరిగిన వేలం పాటే ఇందుకు సాక్ష్యం

ఒక్క ఏడాదికి వచ్చే ఆదాయం కోటిన్నర రూపాయలు

ఐదేళ్లలో వారు చూపిన ఆదాయం కోటి రూపాయలే

మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి బ్యాచ్ పై గ్రామస్తులు ఆగ్రహం

దీనిపై విచారణ చేయించి..చర్యలు తీసుకోవాలని డిమాండ్

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన నసనకోట ముత్యాలమ్మ అమ్మవారి క్షేత్రంలో గత ఐదేళ్లలో ఆరున్నర కోట్ల రూపాయల మేర దోపిడీ జరిగిందని నసనకోట పంచాయతీలోని నాలుగు గ్రామాల ప్రజలు అన్నారు. తాము గతంలో ఇక్కడ భారీ దోపిడీ జరిగిందని.. దీని వెనుక మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి బ్యాచ్ ఉందని చెప్పామని.. ఇప్పుడు అదే నిజమైందని వారు అన్నారు. తాజాగా బుధవారం జరిగిన వేలం పాటే ఇందుకు నిదర్శనమన్నారు. నసనకోట ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో బుధవారం రోజు ఒక సంవత్సరానికి వివిధ విభాగాలకు వేలం పాటలు నిర్వహించారు. ముత్యాలమ్మ ఆలయ కమిటీ మాజీ సభ్యులు, రామగిరి మాజీ జడ్పీటీసీ రామమూర్తి నాయుడు, ఈఓ వెంకటేశ్వర్లు, సత్యసాయి జిల్లా దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్, పోలీస్ అధికారులు, నసనకోట పంచాయతీలోని నాలుగు గ్రామాల ప్రజల సమక్షంలో ఈ వేలం పాట జరిగింది. ఈ వేలంలో ఏ-బ్లాక్, బి- బ్లాక్, సి- బ్లాక్ రూములకు, ఫొటోస్ కు, బియ్యం, కంది బేడలకు, కొబ్బరిచిప్పలకు, ఐస్ క్రీమ్ షాప్స్ కు వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాటలో 89.30 లక్షలకు వేలంలో పాల్గొన్న వ్యాపారులు ఆయా విభాగాలను దక్కించుకున్నారు. ఇంకా హుండీ, షాప్ లను వేలం నిర్వహించాల్సి ఉంది. అందులో సుమారు 60లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇలా ఒక్క సంవత్సరంలోనే కోటిన్నర ప్రకారం ఆలయానికి ఆదాయం వస్తుందనేది సుస్పష్టంగా అర్థమైందని గ్రామస్థులు అన్నారు. ఈ లెక్కన గత ఐదేళ్లలో 7.50కోట్ల రూపాయలు ఆదాయం రాగా.. అప్పటి ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అతని బ్యాచ్ 5సంవత్సరాలలో కేవలం కోటి రూపాయలు ఆదాయం వచ్చినట్టు మాత్రమే చూపారన్నారు. మిగిలిన 6.50 కోట్లను మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, ఆలయ కమిటీ ఛైర్మన్లు, కురుబ ముత్యాలు, బీసీ ముత్యాలు, ఆలయ ఈఓ, పూజారులు దోచుకున్నారన్నారు. అందుకే గత ఐదేళ్లలో ఎంత సొమ్ము వచ్చింది.. అది ఎక్కడ ఖర్చు పెట్టారు.. వంటి వివరాలన్నీ బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.