ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు నేడు ఆయన స్వగ్రామం నారావారిపల్లెలో జరగనున్నాయి. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో నిన్న మధ్యాహ్నం 12.45 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. రామ్మూర్తి పార్థివదేహాన్ని ప్రత్యేక విమానంలో తరలించనున్నారు. ఇప్పటికే ఆయన భౌతికకాయం ఏఐజీ ఆసుపత్రి నుంచి బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంది. మంత్రి నారా లోకేశ్ తన చిన్నాన్న భౌతికకాయాన్ని దగ్గరుండి నారావారిపల్లెకు తరలిస్తున్నారు.
రామ్మూర్తినాయుడు అంత్యక్రియల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. బేగంపేట్ విమానాశ్రయం నుంచి ఆయన మరో ప్రత్యేక విమానంలో తిరుపతికి బయల్దేరుతారు. తిరుపతి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో నారావారిపల్లెకు చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు జరగనున్నాయి. అంత్యక్రియలకు నారా, నందమూరి కుటుంబసభ్యులు హాజరుకానున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజాప్రతినిధులు, నేతలతో పాటు… తెలంగాణ నుంచి కూడా పలువురు నాయకులు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంత్యక్రియలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.