కూటమి ప్రభుత్వానికి ఇండోసోల్‌ సంస్థ బెదిరింపు లేఖ

 కూటమి ప్రభుత్వ చేతకాని తనాన్ని ఈ అంశం తేటతెల్లం చేస్తుంది .  ఎంత లోకువ కాకపొతే . . ఏకంగా ప్రభుత్వాన్నే బెదిరించే స్థాయికి ఒక కంపేజీ చేరిందంటే రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత అనుకోవాలి ? ?

వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా అప్పనంగా భూములు కొట్టేసిన జగన్ బంధువు సంస్థ ఇండ్ సోల్‌ కూటమి ప్రభుత్వానికి బెదిరింపు లేఖలు పంపుతోంది. పోర్టుకు అడ్డంకి లేకుండా ప్రత్యామ్నాయంగా భూములు కేటాయిస్తామని ప్రభుత్వం ప్రతిపాదించినా సరే హెచ్చరికలు చేస్తోంది.

ప్రభుత్వానికి ఇండ్సోల్ బెదిరింపు లేఖ: భూములు ఇవ్వకపోతే మీడియాకు ఎక్కుతాం, కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం దావా వేస్తాం. ఇదీ జగన్ బంధువుకు చెందిన సంస్థ ఇండ్ సోల్ రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్న బెదిరింపుల వ్యవహారం. వైఎస్సార్సీపీ హయాంలో అప్పనంగా భూములు కొట్టేసిన షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ అనుబంధ సంస్థ ఇండోసోల్ ఇటీవలే బెదిరింపు లేఖను ప్రభుత్వానికి పంపింది. రామాయపట్నం వద్ద సోలార్ ఫోటో వోల్టాయిక్ సెల్స్ తయారీ కోసం అంటూ 2023లో దరఖాస్తు చేసిన ఈ సంస్థకు అప్పటి ప్రభుత్వం డీపీఆర్ సమర్పించకుండానే రెండు దశల్లో 8,348 ఎకరాల భూములను కేటాయించింది. మొదటి విడతలో 5,148 ఎకరాలు, రెండో విడతలో 3,200 ఎకరాల మేర భూమిని కట్టబెట్టేలా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయం తీసేసుకుంది. నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు సమీపంలో చేవూరు వద్ద ఈ భూములను కేటాయిస్తున్నట్టు గతంలో వెల్లడించారు.

రామాయపట్నం పోర్టును ఆనుకుని ఉన్న భూముల్నే గతంలో ఇండోసోల్​కు కట్టబెట్టేయటంతో, పోర్టు రాకపోకలకు ఇండోసోల్ దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. పూర్తిగా పోర్టు ల్యాండ్ లాక్ అయిపోయే పరిస్థితి ఉండటంతో అక్కడకు సమీపంలోనే ఉలవపాడు మండలం కారేడు వద్ద ఇండోసోల్​కు ప్రత్యామ్నాయంగా భూమిని ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ఇప్పుడు తమను రీలొకేట్ చేయటం ఏంటని బెదిరిస్తూ ఈ ఏడాది జనవరిలో ఇండోసోల్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్లు ప్రభుత్వానికి లేఖ రాశారు.

గత ప్రభుత్వం కేటాయించిన చోటే భూములు ఇవ్వకపోతే ప్రాజెక్టు వెనక్కు తీసుకుంటామని రీలోకేషన్ కారణంగా సోలార్ సెల్స్ ప్రాజెక్టు మూడేళ్లు వెనకబడుతుందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర పునరుద్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేస్తామని బెదిరించారు. న్యాయ, ఆర్ధిక పరమైన చర్యలతోపాటు మీడియాకు కూడా ఈ వ్యవహరం తెలియచేస్తామంటూ బెదిరింపులు చేయటంపై విస్మయం వ్యక్తం అవుతోంది. ఇండ్ సోల్ సంస్థకు గత ప్రభుత్వం చేసిన కేటాయింపుల్లో ఒక్క ఎకరా భూమిని కూడా కూటమి ప్రభుత్వం తగ్గించలేదు.

రామాయపట్నం సమీపంలోనే కారేడు వద్ద ఈ సంస్థకు 8,348 ఎకరాలను కేటాయించారు. దీనికి తోడు ఫొటో వోల్టాయిక్ సెల్స్ తయారీలో వినియోగించే ముడి సరుకు క్వార్ట్ గనుల్ని కూడా ఇండోసోల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పగించనున్నారు. గత ప్రభుత్వం ప్రకటించినట్టుగానే ఆర్ధిక, ఆర్ధికేతర ప్రోత్సాహకాలను కూడా ఇండ్ సోల్ ప్రైవేట్ లిమిటెడ్ కు యధాతథంగానే కూటమి ప్రభుత్వం కొనసాగించేలా నిర్ణయం తీసుకుంది. అయినా ఇండోసోల్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్లు ఈ బెదిరింపు లేఖలు రాయటంపై ప్రభుత్వ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.