ఏొపీలో జరుగుతున్న అత్యాచారాలపై పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా హొంమంత్రి అనితపై ఆరోపణలు చేశారు. మీరు ఎందుకు పట్టించుకోవడంలేదు.. మీరు ఇలాగే వ్యవహరిస్తే హోం మంత్రి పదవిని నేను తీసుకోవాల్సి వస్తుంది.. నేను తీసుకుంటే పరిస్థితులు ఇలా ఉండవు.. అంటూ హెచ్చరిక కూడా చేశారు. అయితే ఆయన వ్యాఖ్యలపై హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. నేరాల విషయంలో అందరం బాధపడుతున్నామని.. పవన్ కల్యాణ్ బయటపడ్డారు.. మేం పడలేదు.. అంతే తేడా అని చెప్పారు. ఆయనతో క్లారిటీగా మాట్లాడానని, సోమవారం పవన్ మాట్లాడిన మాటలను పాజిటివ్ గా తీసుకుంటానని చెప్పారు.
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను పకడ్బందీగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈమేరకు అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో మహిళలపై అఘాయిత్యాలు, గంజాయి వంటి అంశాలపై చర్చించినట్లు హోంమంత్రి అనిత తెలిపారు. నేరాలను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష జరిపామన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో గ్యాంగ్ రేప్ జరగడం బాధాకరమని హోంమంత్రి అనిత వ్యాఖ్యానించారు. గతంలో రాజకీయంగా నేరాలు ప్రోత్సహించడమే ఇప్పుడీ పరిస్థితికి కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. నేరస్థులకు వెంటనే శిక్షలు విధించి, అమలు చేయడానికి ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబుతో మాట్లాడతానని అనిత చెప్పారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.