వరదలు, భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న తెలుగు రాష్ట్రాలకు మరో పిడుగుపాటి వార్త . భారత వాతావరణ శాఖ (IMD) మరో హెచ్చరిక జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం అంతకంతకూ బలపడుతోందని ఇది ఉత్తర దిశగా కదులుతూ.. 9వ తేదీ నాటికి వాయుగుండంగా మారుతుందని వెల్లడించింది. అప్పటికి అది ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ దగ్గర వైపుగా కదులుతుంది. తర్వాత బెంగాల్, ఒడిశా సరిహద్దుల్లో తీరం దాటే ఛాన్స్ ఉంది. దక్షిణాది రాష్ట్రాలపై ద్రోణి మరో 4 రోజులు కొనసాగుతుందని వివరించింది.
అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. కోస్తాలో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని.. తెలంగాణ, ఏపీ, యానాంలో 8, 9 తేదీల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.10వ తేదీ వరకు ఈ ప్రభావం కొనసాగనున్నట్లు చెప్పింది. ఉత్తర తెలంగాణ, కోస్తా ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది.
హైదరాబాద్ ఊపిరి పీల్చుకో . ..
అయితే హైదరాబాద్‌లో ఇవాళ వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. కానీ ఆకాశం మేఘావృతమై ఉంటుందన్నారు. సెప్టెంబర్ 9వ తేదీన ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. సెప్టెంబర్ 10న కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని చెప్పారు.