Heavy Rain Alert To Andhra Pradesh: ఏపీ లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

Heavy Rain Alert: ఆగ్నేయ బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉపరితల అవర్తన ప్రభావంతో ఇవాళ (సోమవారం) దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు స్టెల్లా తెలిపారు. రెండు రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడి, ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా (ఆంధ్రప్రదేశ్‌) వైపు పయనిస్తుందన్నారు. ఇది తుపానుగా బలపడే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో సోమవారం నుంచి గురువారం వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

బుధవారం రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలకు అవకాశముందని పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌ తెలిపారు. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. పిడుగులు పడే అవకాశాలు ఉండటంతో పొలాల్లో పని చేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద, స్తంభాల వద్ద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని సూచించారు.