ఇటీవల ఏపీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు తీసుకుంటున్నారు అధికారులు. ఇక ఒక్కొ దరఖాస్తుకు నాన్ రిఫండబుల్ ఫీజు కింద రూ.2లక్షలు వసూలు చేస్తున్నారు. దీంతో ఏపీ సర్కార్ ఖజానాకు భారీ ఆదాయం వచ్చి చేరుతోంది.
ఈ క్రమంలో బుధవారం రాత్రి వరకు మొత్తం 57,709 దరఖాస్తులు అందగా రూ. 1154. 18 కోట్ల ఆదాయం సమకూరింది. దరఖాస్తులకు ఇంకా ఈరోజు, రేపుకూడా అవకాశం ఉంది. మరో 40వేల వరకు దరఖాస్తులు రావొచ్చని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలో రెండు దుకాణాలకు అత్యధికంగా 217 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అలాగే అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 4,420, ఏలూరులో 3,843, విజయనగరంలో 3,701 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,396 దుకాణాలు ఉన్నాయి. ఇక వచ్చిన దరఖాస్తుల నుంచి లాటరీ తీసి, దకాణాదారులను ఎంపిక చేస్తారు. 16 నుంచి దుకాణాలను కేటాయిస్తామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఆ రోజు నుంచే కొత్త మద్యం పాలసీ అమలులోకి వస్తుంది.