వెనుకబడిన తరగతుల మెరుగైన జీవనం కోసం బీసీ రక్షణ చట్టం రూపొందిస్తున్నట్లు ఆ సామాజిక వర్గానికి చెందిన ఆంధ్ర ప్రదేశ్ మంత్రులు స్పష్టం చేశారు. ఈ చట్టం రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు రక్షణ కవచంలాంటిదని అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో భాగంగా బీసీ డిక్లరేషన్ లో పేర్కొన్న అన్ని అంశాలనూ సీఎం చంద్రబాబు అమలు చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నారని వారు స్పష్టం చేశారు.
అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మూడో బ్లాక్లో నిర్వహించిన బీసీ రక్షణ చట్టం విధివిధానాల రూపకల్పనపై నిర్వహించిన తొలి సమావేశంలో బీసీ సామాజికవర్గానికి చెందిన మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఎస్.సవిత, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, సత్యకుమార్ యాదవ్, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్ సహా హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు.
బీసీ రక్షణ చట్టం ప్రాముఖ్యతను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వివరించారు. జగన్ హయాంలో రాష్ట్రంలో బీసీల ఆస్తులకు, ప్రాణాలకు రక్షణ కరవైందని విమర్శించారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు బలైపోతున్న బీసీల దుస్థితిని మీ కోసం బస్సు యాత్రలో సీఎం చంద్రబాబునాయుడు, యువ గళం పాదయాత్రలో మంత్రి నారా లోకేశ్ స్వయంగా పరిశీలించారన్నారు. బీసీలను ఆదుకోవాలని నిర్ణయించి.. బీసీ డిక్లరేషన్ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ప్రకటించారన్నారు. ఇచ్చిన హామీలకు కట్టుబడుతూ, సీఎం చంద్రబాబు చర్యలు చేపట్టారన్నారు.